Cabbage Pesarapappu Kura : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాబేజీ కూడా ఒకటి. క్యాబేజి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో క్యాబేజి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. క్యాబేజితో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అందులో భాగంగా క్యాబేజి పెసరపప్పు కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజీ పెసరపప్పు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాబేజ్ తురుము – 5 కప్పులు, నానబెట్టిన పెసరపప్పు – అర కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 3, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – అర టీ గ్లాస్, కారం – ఒక టీ స్పూన్.
![Cabbage Pesarapappu Kura : పెసరపప్పు, క్యాబేజీని కలిపి ఇలా కూరలా వండండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. Cabbage Pesarapappu Kura recipe in telugu very tasty](https://ayurvedam365-com.in9.cdn-alpha.com//opt/bitnami/wordpress/wp-content/uploads/2023/01/cabbage-pesarapappu-kura.jpg)
క్యాబేజీ పెసరపప్పు కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. తరువాత క్యాబేజ్ తురుము, పసుపు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గించాలి. తరువాత పెసరపప్పును వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి కలుపుతూ సగానికి పైగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తరువాత మూత తీసి ఉప్పు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూతను ఉంచి పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. క్యాబేజీ, పెసరపప్పు చక్కగా ఉడికిన తరువాత కారం వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి పెసరపప్పు కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. క్యాబేజీతో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా పెసరపప్పు వేసి కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.