Challa Pindi : చల్లపిండి.. ఈ వంటకం గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. పూర్వకాలంలో ఈ వంటకాన్ని ఎక్కువగా తయారు చేసే వారు. ఈ చల్లపిండి చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. చల్లపిండిని తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చల్లపిండిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చల్ల పిండి తయారీకి కావల్సిన పదార్థాలు..
పుల్లటి పెరుగు – ఒక కప్పు, బియ్యం పిండి – అర కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, నూనె – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చల్లపిండి తయారీ విధానం..
ముందుగా పెరుగును ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత ఈ పెరుగులో ఒక కప్పు నీళ్లు, బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మరో పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. తరువాత తగినంత ఉప్పు వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి కలపాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ముందుగా కలుపుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చల్లపిండి తయారవుతుంది. దీనిని ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్ గా తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.