Mutton Fry : మాంసాహార ప్రియుల్లో చాలా మంది మటన్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. మటన్‌తో మటన్ బిర్యానీ, కూర చేస్తారు. అయితే మటన్ ఫ్రైని కూడా మనం చేసుకుని తినవచ్చు. మటన్ ఉడికేందుకు చాలా సమయం పడుతుంది. అందువల్ల ఫ్రైని చేసేందుకు ఎవరూ అంతగా ఇష్టపడరు. కానీ కాస్త ఓపిక పడితే ఎంతో రుచిగా ఉండే మటన్ ఫ్రైని తయారు చేయవచ్చు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ – 1 కిలో, ఉల్లిపాయలు – 4, జీలకర్ర – 1 టేబుల్ స్పూన్, లవంగాలు – 3, కారం – రుచికి సరిపడా, పసుపు – పావు టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ -3 టేబుల్ స్పూన్లు, నూనె – సరిపడా, దాల్చిన చెక్క – సరిపడా, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – 2 రెబ్బలు, కొత్తిమీర – ఒక కట్ట, పుదీనా తురుము – పిడికెడు, పచ్చిమిర్చి – ఆరు, మిరియాల పొడి – 1 టీస్పూన్, నిమ్మరసం – అరచెక్క.
మటన్ ఫ్రై ని తయారు చేసే విధానం..
ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. నీచు వాసన పోయే విధంగా పసుపు వేసి బాగా కలిపి నీరు పోసి కడగాలి. మటన్ ఉడికించడానికి చాలా సమయం పడుతుంది. అందుకనే ముందుగా కుక్కర్ లో వేసి మటన్‌ని ఉడికించుకోవాలి. ఒక కుక్కర్ తీసుకుని అందులో ముందుగా కడిగిపెట్టుకున్న మటన్ ముక్కలను వేయాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వీటన్నింటిని బాగా కలుపుకుని సరిపడినంత నీరు పోసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు మటన్ ముక్కలను కుక్కర్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. నీరు పోయేంత వరకు చూడాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. అందులో కావాల్సినంత నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వీటితో పాటే పొడవుగా కత్తిరించి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను అందులో వేసుకోవాలి. వీటిని బాగా వేపుకోవాలి. ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్కను వేసుకోవాలి. తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి. బాగా కలిపి వేపుకోవాలి. ఇందులోనే మిరియాల పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. సన్నటి మంట మీద మటన్‌ను ఫ్రై చేసుకోవాలి. సుమారు 10 నిమిషాల పాటు వేపుకోవాలి. ఫ్రై కాబట్టి మూత పెట్టుకోకూడదు. ఇప్పుడు నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే.. రుచికరమైన మటన్ ఫ్రై రెడీ అయినట్లే. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.