రెండడుగులు వేయగానే శక్తి మొత్తాన్ని పీల్చి పిప్పి చేసినట్లు అనిపిస్తుందా. ఎక్కడ లేని నీరసం వస్తుందా. ఉత్సాహంగా పనిచేయలేకపోతున్నారా. అయితే వీటన్నింటికీ జావ సమాధానం చెబుతోంది. ఇంతకీ ఆ జావ ఏంటి, ఎలా తయారు చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చాలా మంది వేసవిలో రాగి జావ తాగుతారు. కానీ వాస్తవానికి దీనికి సీజన్లతో పనిలేదు. ఏ సీజన్‌లో అయినా తాగవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రాగి జావను తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
సాధారణంగా చాలా మందికి నీరసం, అలసట వంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వారు రాగి జావను తయారు చేసి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. శరీరానికి ఉల్లాసంగా అనిపిస్తుంది. శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. నీరసం, అలసట పోతాయి. ఇక దీన్ని ఎలా తయారు చేయాలంటే.. రెండు టీస్పూన్ల రాగి పిండిని కప్పు నీళ్లలో కలపాలి. దీన్ని రెండు గ్లాసుల నీటిలో వేసి తక్కువ మంట మీద ఉడికించాలి. కాస్త ఉప్పు, పలుచని మజ్జిగ కలిపి తాగేయాలి. ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా కూడా తాగవచ్చు. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ తరుగు కూడా వేసుకోవచ్చు. చిన్న బెల్లం ముక్క లేదా తేనె వేస్తే రుచి మరింత పెరుగుతుంది.
ఇక రాగి జావ మాత్రమే కాకుండా బార్లీ జావ కూడా తాగవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలంటే.. నాలుగు టీస్పూన్ల బార్లీ గింజలను శుభ్రంగా కడిగి నాలుగైదు గంటలపాటు నానబెట్టాలి. తగినన్ని నీళ్లను పోసి వీటిని ఉడికించుకోవాలి. ఎక్కువ సేపు నానబెడితే ఉడికేందుకు తక్కువ సమయం పడుతుంది. పలుచని మజ్జిగ, ఉప్పు, చిటికెడు జీలకర్ర పొడి కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో తేనె, నిమ్మరసం కలిపి కూడా తీసుకోవచ్చు. గుప్పెడు దానిమ్మ గిజలను కూడా కలపవచ్చు. దీంతో జావ రుచిగా ఉంటుంది. ఇలా ఈ రెండు రకాల జావలను తయారు చేసి తాగితే నీరసం నుంచి బయట పడవచ్చు. అలసట తగ్గి ఉత్సాహంగా మారుతారు.