Sorakaya Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో సొరకాయ ఒకటి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే సొరకాయ మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బరువు తగ్గడంలో, శరీరంలో వేడిని తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సొరకాయ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. సొరకాయతో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా రుచిగా, వంటరాని వారు కూడా చేసుకున్నేంత సులువుగా సొరకాయలతో ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన లేత సొరకాయ – అర కిలో, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, పుట్నాల పప్పు పొడి – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
సొరకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత సొరకాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత సొరకాయ ముక్కల్లో ఉండే నీరు అంతా పోయే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత పసుపు, కారం, పుట్నాల పప్పు పొడి వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సొరకాయను ఇష్టపడని వారు ఈ విధంగా చేసిన ఫ్రై ను ఇష్టంగా తింటారు. సొరకాయతో ఇలా ఫ్రైను చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.