Sorakaya Tomato Pachadi : మనం సొరకాయను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. సొరకాయతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. సొరకాయ చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. సొరకాయతో కూరలే కాకుండా పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. సొరకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. టమాటాలు వేసి చేసే ఈ పచ్చడిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సొరకాయ ఇష్టపడని వారు కూడా లొట్టలేసుకుంటూ తినేలా సొరకాయతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన సొరకాయ – 1 ( మధ్యస్థంగా ఉన్నది), తరిగిన టమాటాలు – 3, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, నువ్వులు – 3 టీ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 5, చింతపండు – ఒక రెమ్మ.

తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్.
సొరకాయ టమాట పచ్చడి తయారీ విధానం..
ముందుగ కళాయిలో నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు వేగిన తరువాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో సొరకాయ ముక్కలు, టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత నుండి మెత్తగా అయ్యే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో వేయించిన పచ్చిమిర్చి, నువ్వులతో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన సొరకాయ ముక్కలు, టమాట ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి.
తాళింపు చక్కగా వేగిన తరువాత అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు ఉదయం పూట చేసుకునే అల్పాహారాలతో కూడా తినవచ్చు. సొరకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా అప్పుడప్పుడూ పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు.