Sugarcane Juice : పంచదార, బెల్లం వాటిని తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని మనందరికి తెలిసిందే. అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో ఎల్ డి ఎల్ తో పాటు ట్రై గ్లిజరాయిడ్స్ కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలతో బాధపడే వారు చక్కెరను, తీపి పదార్థాలను తీసుకోవడం పూర్తిగా మానేస్తూ ఉంటారు. తీపి రుచి కలిగి ఉన్నప్పటికి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మనకు చెరుకు రసం ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చెరుకు రసాన్ని తరచూ తాగడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయని వారు తెలియజేస్తున్నారు. చెరుకు రసం తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుందని అలాగే దీనిని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుందని 2015 వ సంవత్సరంలో కల్సా కాలేజ్ ఆఫ్ పార్మసీ, పంజాబ్, ఇండియా వారు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.
చెరుకు రసం త్రాగడం వల్ల దీనిలో ఉండే పాలీ కొసనాల్స్ అనే రసాయన సమ్మేళనం కాలేయంలోకి వెళ్లిన తరువాత కొలెస్ట్రాల్ ఉత్పత్తికి అవసరమయ్యే ఎంజైమ్ ఉత్పత్తిని ఆపుతుంది. ఈ ఎంజైమ్ లేనందున్న శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి జరగకుండా ఉంటుంది. ఈ విధంగా చెరుకు రసం శరీరంలో కొలెస్ట్రాల్ ను తయారవ్వకుండా చేస్తుందని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా తెలియజేసారు. ప్రస్తుత కాలంలో చెరుకురసం మనకు సంవత్సరం పొడవునా లభ్యమవుతుంది. 100 గ్రాముల చెరుకు రసంలో 39 క్యాలరీల శక్తి మాత్రమే ఉంటుంది. దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉండవు కనుక అధిక బరువు సమస్యతో బాధపడే వారు కూడా దీనిని తీసుకోవచ్చు. అలాగే చాలా మంది దీనిని తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతాయని భావిస్తూ ఉంటారు. చెరుకురసం తాగడం వల్ల మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే చెరుకు రసం తియ్యగా ఉన్నప్పటికి దంతాలు పుచ్చకుండా ఉంటాయి. చిగుళ్ల సమస్య కూడా రాకుండా ఉంటుంది. సహజ సిద్దంగా లభించే చెరుకు రసం మనకు మేలు తప్ప హానిని కలిగించదని వారు చెబుతున్నారు. ఈ చెరుకు రసంలో ఐస్ క్యూబ్స్ వేయకుండా అలాగే దీనిలో ఇతరత్రా పదార్థాలు ఏమి కలపకుండా తాజా చెరుకు రసం తీసుకున్నప్పుడు మాత్రమే మనం చక్కటి ఫలితాలను పొందుతామని నిపుణులు తెలియజేస్తున్నారు. పంచదార, బెల్లానికి కంటే చెరుకు రసం ఎంతో మేలు చేస్తుందని దీనిని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారు చెరుకు రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని వారు తెలియజేస్తున్నారు.