Ullipaya Dondakaya Vepudu : ఉల్లిపాయ దొండకాయ వేపుడు.. దొండకాయలతో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ వేపుడును తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎంతో రుచిగా ఉండే ఈ ఉల్లిరపాయ దొండకాయవేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ దొండకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, తరిగిన పెద్ద ఉల్లిపాయ – పెద్దది ఒకటి, తరిగిన లేత దొండకాయలు – అరకిలో, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్.
ఉల్లిపాయ దొండకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, దొండకాయ ముక్కలు వేసి కలపాలి. ఇందులోనే ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలను పూర్తిగా వేయించాలి. ఇవి చక్కగా వేగిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత ముక్కలు పొడి పొడిగా అయ్యే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత కారం, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ దొండకాయ వేపుడు తయారవుతుంది. దీనిని అన్నంతో తిన్నా లేదా సైడ్ డిష్ గా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. దొండకాయలను తినని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారు.