Vankaya Bajji Kura : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో వంకాయలు ఒకటి. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయలతో చేసే కూరలు రుచిగా ఉండడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. వంకాయలతో చేసుకోదగిన వివిధ రకాల వంటకాల్లో వంకాయ బజ్జి ఒకటి. ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా దీనిని తేలికగా చేసుకోవచ్చు. అలాగే దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. ఎంతో రుచిగా ఉండే వంకాయ బజ్జిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ బజ్జి కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన వంకాయలు – 4, తరిగిన టమాటాలు – 2, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, పసుపు – పావు టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.
వంకాయ బజ్జి తయారీ విధానం..
ముందుగా స్టవ్ మీద కళాయి ఉంచి వేడి చేయాలి. కళాయి వేడయ్యాక వంకాయలు, టమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం వేయాలి. తరువాత కొద్దిగా నీటిని పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి వంకాయ ముక్కలు, టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి నీరంతా పోయే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత గంటెతో ముక్కలను మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత మరికొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న వంకాయ మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ బజ్జి కూర తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంటచేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు వంకాయలతో ఇలా వంకాయ బజ్జిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన వంకాయ బజ్జిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.