Vellulli Avakaya : మనం వెల్లుల్లి రెబ్బలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వెల్లుల్లి రెబ్బల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలను ఎక్కువగా అల్లంతో కలిపి పేస్ట్ గా చేసి వాడుతూ ఉంటాం. అలాగే పచ్చళ్లల్లో, చట్నీలల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. ఇతర వంటకాల్లో ఉపయోగించడంతో పాటు వెల్లుల్లితో మనం ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు ఎవరైనా దీనిని తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా, కమ్మగా ఉండే వెల్లుల్లి ఆవకాయను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి ఆవకాయ తయారీకి కావల్సిన పదార్థాలు..
వెల్లుల్లి పాయలు – ఒకటింపావు టీ గ్లాసులు, ఆవ పిండి – పావు టీ గ్లాస్, కారం – అర టీ గ్లాస్, ఉప్పు – తగినంత లేదా పావు టీ గ్లాస్ కంటె కొద్దిగా తక్కువ, మెంతులు – అర టీ స్పూన్, నూనె – ఒక టీ గ్లాస్ , నిమ్మకాయలు – 6.
వెల్లుల్లి ఆవకాయ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. తరువాత ఇందులో ఆవపిండి, మెంతులు, కారం, ఉప్పు వేసి కలపాలి. తరువాత నూనె వేసి కలపాలి. చివరగా నిమ్మరసం వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి ఆవకాయ తయారవుతుంది. దీనిని గాజు సీసాలో లేదా జాడిలో వేసి 3 రోజుల పాటు కదిలించకుండా ఉంచాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి బాగా ఊరుతుంది. మూడు రోజుల తరువాత పచ్చడిని మరో సారి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. అన్నంతో కలిపి తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 3 నుండి 4 నెలల పాటు పచ్చడి తాజాగా ఉంటుంది. ఈ విధంగా వెల్లుల్లి ఆవకాయను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.