వెస్టిండీస్ మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ బ్రయన్ లారా. 2004 సంవత్సరంలో అతను టెస్టు మ్యాచులో చేసిన 400 పరుగుల ఇన్నింగ్స్. కెప్టెన్‌గా జట్టు ప్రయోజనం కోసం కాకుండా తన స్వంత రికార్డుని మెరుగుపరచడం కోసం ఆడిన ఇన్నింగ్స్ గా క్రీడా విశ్లేషకులు భావించడం వలన దీనిని స్వార్థపూరితమైన ఇన్నింగ్స్ గా పరిగణించవచ్చును. అంతకుముందు ఇంగ్లాండ్ పై 1994 లో టెస్టు మ్యాచులో 375 పరుగులు చేశాడు లారా. అది అప్పట్లో ప్రపంచ రికార్డు. పదేళ్ళవరకు ఆ రికార్డు చెక్కు చెదరలేదు. ఆ తర్వాత మాజీ ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాథ్యూ హెడెన్ ఆ రికార్డుని 2003/04 టెస్ట్ సిరీస్ లో బద్దలు కొట్టాడు. ఆ మ్యాచ్ లో జింబాబ్వే పైన అతడు 380 పరుగులు చేశాడు.
ఇది జరిగిన ఆర్నెళ్ళలోనే బ్రయన్ లారా సెయింట్ ఆంటిగ్వా మ్యాచులో ఇంగ్లాండ్ పైన నాలుగు వందల పరుగులు చేసి కొత్త చరిత్రని లిఖించాడు. అప్పటికే టెస్టు సిరీస్ ని 0–3 తో చేజార్చుకున్న వెస్టిండీస్ కి చివరి నామమాత్రపు మ్యాచ్ లో లారా సూపర్ ఇన్నింగ్స్ కాస్త ఊరట నిచ్చింది. మొదట మూడు మ్యాచులలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన లారా (మూడు మ్యాచులూ కలిపి వంద పరుగులు చేశాడు) నామమాత్రమైన నాలుగో మ్యాచులో చెలరేగాడు. స్టీవ్ హార్మిసన్, ఆండ్రూ ఫ్లింటాఫ్, మ్యాథ్యూ హొగార్డ్ వంటి మేటి బౌలర్లని ఎంతో ఓపికతో ఎదుర్కొంటూ ఖచ్చితమైన క్రమశిక్షణని కనబరుస్తూ బ్యాటింగ్ చేశాడు లారా.
ఆ మ్యాచ్ లోని మొదటి ఇన్నింగ్స్‌లో అతను ఈ ఫీట్ ని సాధించాడు. సూమారు పదమూడు గంటలు క్రీజులో నిలిచి 582 డెలివరీలను కాచుకుంటూ 43 ఫోర్లతో, నాలుగు సిక్సర్లతో నభూతో న భవిష్యతి అన్నట్లు అతను మారధాన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివరికి డ్రాగా ముగిసిన ఆ మ్యాచ్ వెస్టిండీస్ ని వైట్ వాష్ నుంచి తప్పించినా లారాను కొందరు స్వార్ధపూర్వకుడంటూ దుమ్మెత్తిపోశారు. అతను రికార్డు కోసం అంతసేపు బ్యాటింగ్ చెయ్యకుండా త్వరగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి వుంటే వెస్టిండీస్ ఆ మ్యాచ్ కచ్చితంగా గెలిచి వుండేది అన్నది వారి వాదన.
ఈ మ్యాచ్ కి ముందే అతను నాలుగొందల పరుగులు చేస్తాను అని చెప్పి మరీ బరిలోకి దిగాడు అని అంటుంటారు. అయితే, ఇది నిజమో కాదో తెలీదు. ఒకవేళ అది నిజమే అయితే మాత్రం ఈ ఇన్నింగ్స్ ని అతని ప్రతిభకు తార్కాణంగా భావించవచ్చు. ఎందుకంటే, చెప్పకుండా చెయ్యడం లేదా అనుకోకుండా జరిగిపోవడం అనేది వేరే విషయం. కానీ, చెప్పి చెయ్యడం అంటే మామూలు మాట కాదు. ఆ విషయంలో అతన్ని తప్పక ప్రశంసించాల్సిందే. దీనిని బట్టీ అతనికి తన బ్యాటింగ్ పైన ఎంతగా నమ్మకం ఉన్నదీ తెలుస్తుంది.