Dolo 650 : సాధారణంగా ఇంట్లో ఎవరికైనా తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే మెడికల్ షాపుకు వెళ్లి డోలో 650 ట్యాబ్లెట్ తెచ్చి వేసుకుంటారు. ఆ ట్యాబ్లెట్ ఆ లక్షణాలన్నింటికీ పనిచేస్తుంది. చాలా మందికి నోట్లో సులభంగా పలుకుతుంది. కనుక డోలో 650 ట్యాబ్లెట్ చాలా మందికి గుర్తుంటుంది. దీంతో చాలా మంది దీన్ని సులభంగా వాడుతున్నారు. ఇక కరోనా సమయంలో చాలా మంది దీన్నే ఉపయోగిస్తున్నారు.
మన దేశంలో ప్రస్తుతం అత్యంత పాపులర్ అయిన మెడిసిన్‌గా డోలో 650 అవతరించింది. కరోనా సమయంలో అత్యధిక సంఖ్యలో అమ్ముడైన మెడిసిన్‌గా నిలిచింది. మార్చి 2020 నుంచి లెక్కిస్తే ఇప్పటి వరకు డోలో 650 ట్యాబ్లెట్లను కొన్ని కోట్ల సంఖ్యలో కొనుక్కున్నారు. డోలో 650 అనేది జ్వరం, ఒళ్లు నొప్పులకు బాగా పనిచేస్తుంది. చాలా మంది ఈ ట్యాబ్లెట్లను ఇంట్లో ఎల్లప్పుడూ స్టాక్ పెట్టుకుంటారు.
2020లో మొదటిసారిగా మన దేశంలో కోవిడ్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 350 కోట్ల డోలో 650 ట్యాబ్లెట్లను విక్రయించారు. ఈ ట్యాబ్లెట్లను ఒకదానిపై ఒకటి పేర్చితే దాదాపుగా ఎవరెస్ట్ శిఖరం కన్నా 6000 రెట్లు ఎత్తు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గత 2 సంవత్సరాల కాలంలో అత్యధికంగా అమ్ముడైన ట్యాబ్లెట్‌గా డోలో 650 నిలిచింది. మన దేశంలో డోలో 650ని తయారు చేస్తున్న సంస్థ 2019కి ముందు సుమారుగా 75 మిలియన్ల స్ట్రిప్‌ల ట్యాబ్లెట్లను విక్రయించింది. 2021లో రూ.307 కోట్ల టర్నోవర్‌ను ఈ ట్యాబ్లెట్ల అమ్మకాల ద్వారా నమోదు చేసింది. దీంతో డోలో సరికొత్త రికార్డును సృష్టించినట్లు అయింది. అయితే ఇంత చేసినా పారాసిటమాల్ ట్యాబ్లెట్ల జాబితాలో డోలోది రెండో స్థానమే. దీని కన్నా ముందు కాల్‌పాల్ ట్యాబ్లెట్ ఉంది. ఈ క్రమంలోనే డోలో 650 ట్యాబ్లెట్లపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.