కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడం లేదు. ఎన్నో వేరియెంట్లుగా మారి ఇప్పటికే ఎంతో మందిని బలిగొంది. ఎంతో ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. తాజాగా ఒమిక్రాన్ రూపంలో ఇంకో కొత్త వేరియెంట్ మాదిరిగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది.
కరోనా ఒమిక్రాన్ వేరియెంట్‌ను ముందుగా సౌతాఫ్రికాలో గుర్తించారు. అయితే ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకూ విస్తరించింది. దీంతో అనేక దేశాలు అలర్ట్ అయ్యాయి. ఒమిక్రాన్ బాధితులను ప్రత్యేకంగా గుర్తిస్తూ వారికి చికిత్సను అందిస్తున్నారు. ఇక ఈ కొత్త వేరియెంట్ ప్రస్తుతం చిన్నారులకు కూడా వ్యాప్తి చెందుతోంది.
ఒమిక్రాన్ వేరియెంట్ సౌతాఫ్రికాలో పలువురు చిన్నారులకు వ్యాప్తి చెందుతుండడం ఆందోళనను కలిగిస్తోంది. ఈ వేరియెంట్ ఇప్పటి వరకు పెద్దలకు మాత్రమే సోకింది. కానీ చిన్నారులకు వ్యాప్తి చెందుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ వేరియెంట్ వచ్చిన వారిలో పలు లక్షణాలు కనిపిస్తున్నాయని అక్కడి వైద్యులు చెబుతున్నారు.
ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి చెందుతున్న చిన్నారుల్లో తీవ్రమైన అలసట, సాధారణ కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన జ్వరం, దగ్గు, గొంతులో దురద వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ లక్షణాలు కొందరిలో ఉండడం లేదు. కొందరిలో మధ్యస్థంగా, ఇంకొందరిలో తీవ్రంగా ఉంటున్నాయి. కానీ ఈ లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.