పూర్వకాలంలో మన పెద్దలు ఆహారం విషయంలో కచ్చితమైన జాగ్రత్తలను పాటించే వారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. అందుకనే వారు ఎక్కువ ఏళ్ల పాటు ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించారు. కానీ ఇప్పుడు మనం ప్రతి పూట భోజనం విషయంలో అశ్రద్ధ చేస్తున్నాం. దీంతో అనేక వ్యాధుల బారిన పడుతున్నాం. అయితే ఆయుర్వేదం విషయానికి వస్తే ఆహారం తీసుకునే విషయంలో పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం భోజనాన్ని మూడు విధాలుగా తీసుకోవాలని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకున్న తరువాత జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఉండాలంటే కచ్చితంగా మూడు నియమాలను పాటించాలని ఆయుర్వేదం చెబుతోంది. మొదటి నియమం.. హితభుక్త.. అంటే శరీరానికి మేలు చేసే ఆహారాన్నే తినాలి. చెడు చేసే ఆహారాన్ని తినకూడదు. శరీరానికి మేలు చేసే ఆహారం అయితేనే సులభంగా జీర్ణమవుతుంది. దీంతో జీర్ణ సమస్యలు రావు. అలాగే పోషకాలు కూడా లభిస్తాయి. దీన్నే హిత భుక్త ఆహారం అంటారు.
రెండోది.. మితభుక్త.. అంటే మన శరీరానికి ఎంత ఆహారం అవసరమో అంతే తినాలి. అతిగా తినకూడదు. అతిగా ఆహారం తిన్నా, సమయపాలన లేకుండా భోజనం చేసినా, ఎక్కువ ఆహారాలను తిన్నా జీర్ణ సమస్యలు వస్తాయి. కనుక ఆయుర్వేద ప్రకారం ప్రతి ఒక్కరు మిత భుక్త నియమాన్ని పాటించాలి.
మూడోది చివరి నియమం.. రుతు భుక్త. అంటే ఆయా రుతువుల్లో లభించే ఆహారాలను తప్పనిసరిగా తినడం. అంటే కేవలం సీజన్లలోనే లభించే ఆహారాలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తినడం అన్నమాట. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇలా ఆహారం విషయంలో మూడు నియమాలను పాటిస్తే ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.