Betel Leaves : ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు వచ్చిన అతిథులకు తాంబూలాన్ని ఇవ్వడం మన సంప్రదాయం. తాంబూలంగా ఇచ్చే వాటిలో తమలపాకు కూడా ఒకటి. భారతీయులకు తమలపాకు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. భోజనానంతరం కిల్లీని తినే వారు చాలా మందే ఉంటారు. తమలపాకు లేనిదే కిల్లీని తయారు చేయలేము. దీనిని నాగవల్లి అని కూడా అంటారు. ఇది తీగ జాతి మొక్క. తమలపాకు మొక్క వేడి, తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పెరుగుతుంది. తమలపాకులో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఆయుర్వేదంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో తమలపాకులను ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
తమలపాకు తీగ నాటిన రెండు నెలలకు ఆకులు కోతకు వస్తాయి. మనకు వివిధ రకాల తమలపాకులు లభిస్తూ ఉంటాయి. మనలో చాలా మందికి తమలపాకు తీగను ఇంట్లో పెంచుకుంటే ధనం కలిసి వస్తుందని, ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవని భావిస్తారు. తమలపాకుల వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గొంతు నొప్పిని తగ్గించడంలో తమలపాకు ఎంతో ఉపయోగపడుతుంది. తమలపాకు రసాన్ని తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. తమలపాకులలో ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడే కాల్షియం, కంటి చూపును మెరుగుపరిచే విటమిన్ ఎ, రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి లతోపాటు ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. శ్వాస కోస సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నప్పుడు తమలపాకుకు ఆముదాన్ని రాసి వేడి చేసి ఛాతిపై ఉంచుకోవడం వల్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
తమలపాకులలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. బాలింతలు ఏ కారణం చేత అయినా పిల్లలకు పాలు ఇవ్వనప్పుడు స్థనాలలో పాలు ఎక్కువగా నిలిచి గడ్డ కట్టి నొప్పిని కలిగిస్తాయి. అలాంటి సందర్భాలలో తమలపాకును వేడి చేసి స్థనాలపై కట్టుకోవడం వల్ల నొప్పి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. తమలపాకు షర్బత్ తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఊపిరితిత్తుల్లో పేరుకు పోయిన కఫం తొలగిపోతుంది. తమలపాకు రసాన్ని పాలలో కలుపుకుని తాగడం వల్ల కోపం, క్షణికావేశం తగ్గుతాయి.
చర్మాన్ని కాంతి వంతంగా చేసి ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేసే శక్తి కూడా తమలపాకులకు ఉంటుంది. తమలపాకును తరచూ తింటూ ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటాం. అధిక బరువుతో బాధపడే వారికి కూడా తమలపాకు ఉపయోగపడుతుంది. తమలపాకులపై10 గ్రా. మిరియాల పొడిని వేసి తిని వెంటనే చల్లని నీటిని తాగడం వల్ల బరువు తగ్గి నాజుగ్గా తయారవుతారు.
తమలపాకు రసం, తులసి ఆకుల రసం, అల్లం రసం, మిరియాల పొడి, తేనె కలిపి ఇవ్వడం వల్ల పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి. నోటి దుర్వాసనను తగ్గించే గుణం కూడా తమలపాకులకు ఉంది. కీళ్ల వాపులతోపాటు శరీరంలో వాపులు ఉన్న చోట తమలపాకును వేడి చేసి కట్టుగా కట్టడం వల్ల వాపులు తగ్గుతాయి. తమలపాకులను మెత్తగా నూరి తలకు పట్టించి గంట సేపు ఉంచి తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.
లైంగిక శక్తిని పెంచడంలోనూ తమలపాకు ఉపయోగపడుతుంది. తమలపాకు రసాన్ని లేదా తమలపాకును నేరుగా తినడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుంది. పురుషాంగం బలంగా తయారవుతుంది. స్త్రీలు తమలపాకుకు ఉండే కాడను తీసేసిన తరువాతే తినాలని, కాడతో సహా తమలపాకును తినకూడదని, ఇలా తినడం వల్ల సంతానం కలగదని నిపుణులు చెబుతున్నారు.
తమలపాకును తినడం వల్ల, దాన్ని రసాన్ని తాగడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ప్రతి ఇంట్లో తమలపాకు తీగ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని ఉపయోగించి మందులను వాడే పని లేకుండా మనకు వచ్చే అనారోగ్య సమస్యలన్నింటినీ నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.