Neem Stick : ప్రకృతి ప్రసాదించిన.. అనేక ఔషధ గుణాలు కలిగిన చెట్లలో వేప చెట్టు ఒకటి. వేప చెట్టు వల్ల కలిగే ప్రయోజనాలు మనందరికీ తెలుసు. వేప చెట్టులో ప్రతి భాగం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అనేక రకాల ఇన్ ఫెక్షన్ లను తగ్గించడంలో వేప నూనెను, వేప ఆకులను, వేప బెరడును ఉపయోగిస్తారు. మనలో చాలా మంది వేప పుల్లలతో అప్పుడప్పుడూ బ్రష్ కూడా చేస్తూ ఉంటారు. వేప పుల్లలతో బ్రష్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వ కాలంలో అందరు వేప పుల్లలతోనే దంతాలను శుభ్రం చేసుకునే వారు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న టూత్ బ్రష్ , టూత్ పేస్ట్ కంటే వేప పుల్ల ఎంతో మేలైనది. వేప పుల్లతో దంతాలను శుభ్ర చేసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దంతాల మధ్య, చిగుళ్లపై ఉండే సూక్ష్మ జీవులను చంపడంలో వేప పుల్ల ఎంతో సహాయపడుతుంది. నోట్లో ఉండే క్రిములను చంపే శక్తి లాలాజలానికి ఎక్కువగా ఉంటుంది. వేప పుల్లతో దంతాలను శుభ్రం చేయడం వల్ల వేపలో ఉండే చేదు కారణంగా లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి క్రిములు నశించేలా చేస్తుంది.
దంతాల చిగుళ్లు, దంతాలపై ఉండే గార తొలగిపోయేలా చేయడమే కాకుండా బాక్టీరియా వల్ల కలిగే ఇన్ ఫెక్షన్లు కూడా వేప పుల్లలతో బ్రష్ చేయడం వల్ల తగ్గుతాయి. టూత్ పేస్ట్ ల వల్ల నోరు తాజాగా ఉన్నప్పటికీ క్రిములను చంపే శక్తి టూత్ పేస్ట్ కు ఎక్కువగా ఉండదు. వేప పుల్లలను నములుతూ దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల గొంతులో పేరుకు పోయిన కఫం, శ్లేష్మం కూడా తొలగిపోతాయి.
నోటిలో, గొంతులో ఇన్ ఫెక్షన్లు రాకుండా చేయడంలో వేప పుల్ల ఎంతో ఉపయోగపడుతుంది. వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల నోరు ఎంతో తాజాగా ఉంటుంది. వేప పుల్లతో కలిగే పరిశుభ్రత, స్వచ్చతా ఏ ఇతర టూత్ పేస్ట్ లను వాడినా కూడా మనం పొందలేమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో వేప పుల్లలను ఉపయోగించే వారు చాలా తక్కువగా ఉన్నారు. కనీసం వారానికి రెండు సార్లు వేప పుల్లలతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు గార పట్టకుండా ఉండడమే కాకుండా.. గొంతులో పేరుకు పోయిన కఫం తొలగిపోతుంది. నోటిలో, గొంతులో ఉండే ఇన్ ఫెక్షన్లు, టాన్సిల్స్ వల్ల కలిగే ఇన్ ఫెక్షన్లు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో అవి రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.