Veg Biryani : మనం రకరకాల బిర్యానీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో వెజ్ బిర్యానీ ఒకటి. వెజ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ దీన్ని సరిగ్గా తయారు చేస్తేనే మనం అనుకునే రుచి వస్తుంది. లేదంటే అంత రుచి రాదు. అన్ని పదార్థాలను సరైన మిశ్రమంలో కలిపి తయారు చేస్తేనే వెజ్ బిర్యానీ బాగా వస్తుంది. ఇక చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలో ఎంతో రుచిగా వెజ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – పావు కిలో, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 4, పెద్దగా తరిగిన బంగాళాదుంప – 2, తరిగిన క్యారెట్ – 1, తరిగిన టమాట-1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – అర టేబుల్ స్పూన్, లవంగాలు – 3, యాలకులు – 3, బిర్యానీ ఆకు – 1, సాజీరా – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – 2, జీడిపప్పు – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, పెరుగు – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – తగినన్ని.
వెజ్ బిర్యానీ తయారు చేసే విధానం..
ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. తరువాత ఒక కుక్కర్ లో నూనె, నెయ్యి వేసి కాగాక బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. తరువాత తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక తరిగిన కొత్తిమీర, క్యారెట్, బంగాళాదుంపలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత పసుపు, ధనియాల పొడి, కారం, పెరుగు, తరిగిన టమాటాలు వేసి కలుపుకోవాలి. టమాటాలు కొద్దిగా ఉడికిన తరువాత నానబెట్టిన బియ్యాన్ని వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ బిర్యానీ తయారవుతుంది. ఇందులో పచ్చి బఠానీలు, ఇతర కూరగాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. దీనిని నేరుగా లేదా పెరుగు చట్నీతో లేదా కూరలతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.