Barley : మనం ఆహారంగా తీసుకునే ధాన్యాల్లో బార్లీ కూడా ఒకటి. బ్రెడ్ తయారీలో అలాగే కొన్ని రకాల పానీయాల తయారీలో దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే దీనితో వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇతర ధాన్యాల వలె బార్లీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల బార్లీలో 354 క్యాలరీల శక్తి, 452 మైక్రో గ్రాముల పొటాషియం, 17 గ్రాముల ఫైబర్, 19 శాతం ఐరన్, 15 శాతం విటమిన్ బి6, 33 శాతం మెగ్నీషియం, 3 శాతం క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. బార్లీని ఉడికించి ఆహారంగా తీసుకున్నా లేదా నీటిలో మరిగించి ఈ నీటిని తాగినా ఇలా ఎలా తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారికి బార్లీ చక్కటి ఆహారమని చెప్పవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుంగె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీర బరువును తగ్గించడంలో బార్లీ మనకు ఎంతో సహాయపడుతుంది. బార్లీని ఉడికించిన నీటిని తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గు ముఖం పడుతుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి. శరీరంలో మలినాలు తొలగిపోతాయి. శరీరం శుభ్రపడుతుంది. బార్లీనిఆహారంగా తీసుకోవడం వల్ల మనం పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటాము. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేగుల్లో కదలికలు పెరిగి మలబద్దకం సమస్య నివారించబడుతుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బార్లీ గింజల్లో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఆస్ట్రోపోరోసిస్ వంటి ఎముకలకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కూడా బార్లీ గింజలను మనకు తోడ్పడతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, వృద్దాప్య ఛాయలను మన దరి చేరకుండా చేయడంలో, గాయాలను త్వరగా మానేలా చేయడంలో, శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా బార్లీ గింజలు మనకు ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేకరకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. కనుక వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.