దంపతులు అన్నాక శృంగారంలో భాగంగా ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడం సహజమే. కౌగిలింత వల్ల ఇద్దరిలోనూ ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆప్యాయత కలుగుతాయి. వారిద్దరూ అన్యోన్యంగా ఉన్నారనడానికి ఆ కౌగిలింతే నిదర్శనం. అయితే కౌగిలింత వల్ల కేవలం ఇవే కాదు, ఇంకా మరెన్నో లాభాలు ఉన్నాయని చెబుతున్నారు సైంటిస్టులు. అవును, మీరు విన్నది నిజమే. కేవలం శృంగారంలో పాల్గొన్నప్పుడు మాత్రమే కాకుండా ఇతర సమయాల్లోనూ ఆలుమగలు ఒకరినొకరు కౌగిలించుకుంటే దాంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వారు అంటున్నారు.
ఆలుమగలు కౌగిలించుకోవడం వల్ల వారిలో ఉండే మానసిక ఆందోళన పోతుందట. వారికి ఏమైనా బాధలు ఉన్నా ఇట్టే తగ్గిపోతాయట. ప్రేమగా ఇచ్చే కౌగిలింత వల్ల ఇద్దరిలోనూ ఉండే అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యం కలుగుతుందట. ఇక కౌగిలింత వల్ల పురుషుల కన్నా మహిళలకే ఎక్కువగా ఉపయోగం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇదే విషయాన్ని చెబుతున్నారు.
కౌగిలింతలో ఉన్నప్పుడు స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ ఆరోగ్యానికి మేలు చేసే పలు హార్మోన్లు ఉత్పత్తి అవుతాయట. దీంతో వారిద్దరిలోనూ ఉండే మానసిక సమస్యలు దూరమవుతాయట. ఆలింగనం వల్ల హై బీపీ తగ్గుతుందట. అలాగే కౌగిలించుకున్నప్పుడు ఇద్దరిలోనూ డొపమైన్, సెరటోనిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల అవుతాయి కనుక ఇవి ఇద్దరి మూడ్‌ను మార్చి వారిని సంతోషంగా ఉండేలా చేస్తాయట. దీంతో ఇద్దరిలోనూ ఉన్న మానసిక సమస్యలు పోతాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక.. దంపతులూ.. ఇక మీకు ఏదైనా మానసిక సమస్య ఉంటే డీలా పడిపోకండి. ఒక్కసారి ఆప్యాయంగా కౌగిలించుకోండి. దాంతో మీ ఒత్తిడి మటుమాయం కాకపోతే అప్పుడు అడగండి.