కరోనా బారిన పడ్డవారు దాని నుంచి కోలుకున్న తరువాత వారికి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరికి ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయి. కొందరిలో గుండె సమస్యలు, ఇంకొందరికి డయాబెటిస్ వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే కొత్తగా మరో అనారోగ్య సమస్య కూడా వస్తుందని వైద్య నిపుణులు గుర్తించారు. అదే.. డీప్ వీన్ త్రాంబోసిస్ (డీవీటీ).
డీవీటీ సాధారణంగా కాళ్లలో వస్తుంది. గాయాలు అయినప్పుడు అక్కడ రక్త స్రావం అధికంగా కాకుండా అడ్డుకునేందుకు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు ఆ భాగంలో రక్తం గడ్డ కడుతుంది. అయితే గాయం మానగానే ఆ గడ్డలు వాటంతట అవే కరిగిపోతాయి. కానీ కొందరిలో ఆ గడ్డలు కరగవు. అలాగే ఉంటాయి. ఆ స్థితినే త్రాంబోసిస్ అంటారు. ఇక శరీరంలో రక్తం గడ్డ కట్టే భాగాన్ని బట్టి ఈ వ్యాధిని భిన్న పేర్లతో పిలుస్తారు. కాళ్లలో రక్తం గడ్డ కడితే దాన్ని డీవీటీ అంటారు.
కరోనా బారిన పడి కోలుకున్న వారిలో డీవీటీ సమస్య ఎక్కువగా వస్తుందని వైద్యులు నిర్దారించారు. సాధారణంగా ఈ సమస్య పలు భిన్న కారణాల వల్ల వస్తుంది. రోజూ ఒకే చోట కూర్చుని ఎక్కడికీ కదలకపోవడం, గర్భిణీలకు, మహిళలు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం, డీహైడ్రేషన్ వంటి కారణాల వల్ల డీవీటీ వస్తుంది. కానీ కోవిడ్ సోకిన వారిలో, దాని నుంచి కోలుకున్న వారిలోనూ ప్రస్తుతం డీవీటీ వస్తోంది.
డీవీటీ ఉంటే సహజంగా వైద్యులు శస్త్ర చికిత్స చేస్తారు. కానీ వ్యాధి తీవ్రంగా ఉంటేనే వారు ఆ పనిచేస్తారు. లేదంటే యాంటీ కోఆగులేషన్ మందులను ఇస్తారు. వాటిని వాడితే గడ్డలు కరిగిపోతాయి. ఇక పలు జాగ్రత్తలను పాటించడం వల్ల కూడా డీవీటీ నుంచి బయట పడవచ్చు.
డీవీటీ సమస్య వచ్చిన వారు రోజూ తగినంత నీటిని తాగాలి. అధికంగా బరువు ఉంటే బరువును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రోజూ అన్ని పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. మద్యం సేవించడం, పొగ తాగడం మానేయాలి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవాలి.
విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలైన వాల్ నట్స్, పాలకూర, పొద్దు తిరుగుడు విత్తనాలు, ఆలివ్ నూనె, మిరియాలు, విటమిన్ కె అధికంగా ఉండే పాలకూర, నట్స్, యాప్రికాట్స్, ఆకుకూరలు వంటి ఆహారాలను తీసుకుంటుంటే ఈ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.
రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను బాగా నలిపి అలాగే తినాలి. రాత్రి భోజనం అనంతరం దాల్చిన చెక్క వేసి మరిగించిన నీటిలో తేనె కలిపి తాగాలి. ఈ విధంగా చేయడం వల్ల డీవీటీ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365