నిద్ర మనకు అత్యంత అవసరం. ప్రతి రోజూ మనం కచ్చితంగా 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. వృద్ధులు, పిల్లలు అయితే 10 గంటలకు పైగానే నిద్ర పోవాల్సి ఉంటుంది. నిద్ర వల్ల శరీరం రీచార్జ్ అవడమే కాదు, పలు రకాల అనారోగ్య సమస్యలు పోతాయి. మనం నిద్రపోయే క్రమంలో శరీరం తనకు తానే పలు మరమ్మత్తులు కూడా చేసుకుంటుంది. అందుకే మనం కచ్చితంగా రోజూ నిర్దిష్ట సమయం ప్రకారం నిద్రపోవాలి. నిర్దిష్టమైన గంటలపాటు నిద్రించాలి. అయితే రోజుకు 6 గంటల కన్నా తక్కువగా నిద్రపోయే వారు కూడా ఉంటారు. మరి అలా నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా..? దాని గురించే ఇప్పుడు చూద్దాం..!
నిత్యం 6 గంటల కన్న తక్కువ నిద్రపోతే ఆ తరువాతి 48 గంటల పాటు శరీరానికి సరిపడా ఆక్సిజన్ లభించదు. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దరి చేరతాయి. ఆరు గంటల కన్నా తక్కువ నిద్రిస్తే ఆ రోజంతా ఉత్సాహంగా ఉండరు. నిరాసక్తంగా, స్తబ్దుగా, మబ్బుగా ఉంటారు. ఏ పనీ యాక్టివ్‌గా చేయరు. ఇది మూడ్‌ను మారుస్తుంది. నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రపోకపోతే అది మెదడుపై ప్రభావం చూపుతుంది. మెదడు షార్ప్‌నెస్ తగ్గుతుంది. దీంతో జ్ఞాపకశక్తి తగ్గడమే కాదు, ఏ విషయాన్ని సరిగ్గా ఆలోచించలేరు. ఆలోచనా శక్తి తగ్గుతుంది. చదువుల్లో ఉన్నవారైతే వాటిలో రాణించలేరు. ఏ విషయాన్ని సరిగ్గా గుర్తు పెట్టుకోలేరు. సరిపడా నిద్రపోకపోతే డిప్రెషన్ బారిన పడతారు. సంతోషం స్థాయిలు తగ్గుతాయి. అలాంటి వారు ఎల్లప్పుడూ మూడీగా ఉంటారు. అది ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ఆఫీసులో పనిచేసే ఉద్యోగులైనా, చదువుకునే విద్యార్థులైనా తమ పనిపై సరిగ్గా ఫోకస్ పెట్టలేరు. దీంతో అనుకున్న పని పూర్తి చేయలేకపోతారు. దాని వల్ల పై నుంచి ఒత్తిళ్లు ఎదుర్కుంటారు. నిత్యం తగినన్ని గంటలు నిద్రపోక పోతే స్త్రీ, పురుషుల్లో శృంగార వాంఛ తగ్గుతుంది. పురుషుల్లో అయితే టెస్టోస్టిరాన్ లెవల్స్ తగ్గి శృంగారం అంటే అంతగా ఆసక్తి ప్రదర్శించరు. ఒక వేళ చేసినా సరైన సామర్థ్యం ఉండదు. సరిగ్గా నిద్రపోక పోతే ఎదురయ్యే ఇంకో సమస్య బరువు పెరగడం. నిద్ర తగినంతగా పోకపోతే బరువు పెరుగుతారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక ఫ్యాట్‌గా మారకుండా ఉండాలంటే కనీసం తగినన్ని గంటల నిద్ర అవసరం. వృద్ధాప్యం త్వరగా వచ్చేస్తుంది. నిద్ర పోకపోతే అలాంటి వారి ముఖంపై ముడతలు పడతాయి. అది వృద్ధాప్య ఛాయలను తెలియజేసేందుకు మొదటి సంకేతం. అలా అలా క్రమంగా వారికి త్వరగా వృద్ధాప్యం వస్తుంది.