Curd : పెరుగును మనం ఎంతో పురాతన కాలం నుంచే తింటున్నాం. పూర్వం రోజుల్లో చాలా మంది ఇళ్లలో పశువులు ఉండేవి. దీంతో పాలకు, పెరుగుకు, నెయ్యికి కొరత ఉండేది కాదు. అందువల్ల అప్పట్లో చాలా మంది రోజూ గడ్డ పెరుగు తినేవారు. స్వచ్ఛమైన నెయ్యి వాడేవారు. అందుకనే అప్పటి వారు శారీరకంగా ఎంతో బలంగా ఉండేవారు. అయితే ఇప్పుడు కూడా మనకు పలు బ్రాండెడ్ కంపెనీలు నాణ్యమైన, స్వచ్ఛమైన పెరుగును, నెయ్యిని విక్రయిస్తున్నాయి. అయితే ఇప్పుడు పెరుగు గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం.
సాధారణంగా చాలా మంది భోజనం చివర్లో పెరుగు తింటారు. అన్నంలో కలుపుకుని లేదా కొందరు నేరుగా పెరుగునే తింటుంటారు. భోజనం చివర్లో పెరుగు తినకపోతే కొందరికి భోజనం పూర్తి చేసిన ఫీలింగ్ కలగదు. అందుకనే చాలా మంది పెరుగును భోజనం చివర్లో తప్పకుండా తింటుంటారు. అయితే పెరుగును కొందరు ఉప్పుతో కలిపి తినేందుకు ఇష్టపడతారు. కొందరు మాత్రం పెరుగులో చక్కెర కలిపి తింటారు. అయితే ఈ రెండింటిలో ఏది మంచి ఆప్షన్..? పెరుగును దేంతో కలిపి తింటే మనకు మేలు జరుగుతుంది..? దీనిపై డైటిషియన్లు ఏమని సమాధానం చెబుతున్నారు..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగును ఉప్పు లేదా చక్కెర.. దేంతో అయినా సరే కలిపి తినవచ్చు. ఎవరి అభిరుచులకు అనుగుణంగా వారు పెరుగును తినవచ్చు. కానీ హైబీపీ ఉన్నవారు మాత్రం పెరుగును ఉప్పుతో కలిపి తినకూడదు. ఎందుకంటే ఉప్పులో సోడియం ఉంటుంది కనుక ఇది శరీరంలో చేరి రక్తపోటును పెంచుతుంది. ఇది మైబీపీ ఉన్నవారికి మంచిది కాదు. కనుక హైబీపీ ఉన్నవారు అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా పెరుగును ఉప్పుతో కలిపి తినకూడదు.
ఇక అధిక బరువు ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు లేదా డయాబెటిస్, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు పెరుగును చక్కెరతో కలిపి తినకూడదు. తింటే శరీరంలో క్యాలరీలు ఎక్కువగా చేరుతాయి. దీంతో వారికి ఉన్న సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక వీరు పెరుగులో చక్కెర కలిపి తినకూడదు. ఇక ఆరోగ్యవంతమైన వ్యక్తులు పెరుగును ఎలా తీసుకున్నా సరే దాంతో ప్రయోజనాలను పొందవచ్చు. పెరుగు మంచి ప్రొబయోటిక్ ఆహారం. కనుక జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి ఈ విషయాలను గుర్తు పెట్టుకుని ఎవరైనా పెరుగును తినాలి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.