Dengue Alert : దోమలు వృద్ధి చెందేందుకు వర్షాకాలాన్ని మంచి అనువైన సమయంగా చెప్పవచ్చు. ఈ కాలంలోనే దోమలు రెట్టింపు సంఖ్యలో మనపై దాడి చేస్తుంటాయి. కనుక దోమల నుంచి మనం ఎంత జాగ్రత్తగా ఉండే మనకు అంత ఎక్కువ సేఫ్టీ లభిస్తుంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి కనుక డెంగ్యూ దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో, ఇంటి చుట్టు పక్కల నీరు నిల్వ ఉండకుండా చూడాలి. అలాగే దోమలను నియంత్రించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.
డెంగ్యూ వచ్చిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి ఉంటాయి. అలాగే కండరాలు, కీళ్ల నొప్పులు కూడా ఉంటాయి. దీంతోపాటు వికారంగా ఉండి వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. అలాగే కొందరికి చర్మంపై దురదలు వచ్చి దద్దుర్లు కూడా ఏర్పడుతాయి. అయితే డెంగ్యూ దోమ కుట్టిన తరువాత కొందరికి 2 రోజులకు జ్వరం వస్తుంది. కానీ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటే అలాంటి వారిలో లక్షణాలు కనిపించేందుకు 4 నుంచి 7 రోజుల వరకు సమయం పట్టవచ్చు. అయితే లక్షణాలు కనిపిస్తే వెంటనే డెంగ్యూ పరీక్షలు చేయించుకోవాలి. డెంగ్యూ ఉన్నట్లు నిర్దారణ అయితే వెంటనే చికిత్స తీసుకోవాలి.
డెంగ్యూ లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. డెంగ్యూ ఉన్నవారు చికిత్స తీసుకోకపోతే ముందుగా అది తీవ్రమైన డెంగ్యూగా మారుతుంది. దీన్నే డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్ అంటారు. ఈ దశలో డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వచ్చే చాన్స్ ఉంటుంది. అలా జరిగితే ప్లేట్‌లెట్స్ సంఖ్య గణనీయంగా పడిపోతుంది. దీంతో రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి. ఫలితంగా షాక్‌కు గురవుతారు. అంతర్గతంగా బ్లీడింగ్ అవుతుంది. అవయవాలు చెడిపోతాయి. చివరకు రక్తస్రావం అధికమై మరణం సంభవిస్తుంది.
కనుక డెంగ్యూ వచ్చిన వారు ఎప్పటికప్పుడు ప్లేట్‌లెట్స్ టెస్ట్ చేయించుకోవాలి. ప్లేట్ లెట్స్‌ను పడిపోకుండా చూసుకోవాలి. సాధారణంగా జ్వరం తగ్గితే ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుంది. కనుక డాక్టర్‌చే చికిత్స తీసుకుంటూ ముందుగా జ్వరాన్ని తగ్గించుకోవాలి. అప్పటి వరకు తగ్గిన ప్లేట్‌లెట్స్ ఆ తరువాత పెరుగుతాయి. దీంతో డెంగ్యూ నుంచి కోలుకుంటారు. అలా కాకుండా ప్లేట్‌లెట్స్ పడిపోతున్నా నిర్లక్ష్యంగా ఉన్నారంటే మాత్రం పైన చెప్పిన విధంగా పలు తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయి. దీంతో ప్రాణాలే పోతాయి. కనుక డెంగ్యూ వచ్చిన వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.