కరోనా మహమ్మారి రోజు రోజుకీ ప్రజలపై పంజా విసురుతోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కోవిడ్ బాధితులు ఆ వ్యాధి నుంచి కోలుకున్నా రోజులు గడిచేకొద్దీ వారికి పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కనుక ఆయా సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పోషకాలు, శక్తిని ఇచ్చే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారు ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పూట నీటిలో నానబెట్టిన బాదంపప్పులు 5-6 ఉదయాన్నే తినాలి. అలాగే నానబెట్టిన కిస్మిస్‌లు, రాగి దోశ, వాల్ నట్స్ తీసుకోవాలి. అల్లం, తులసి ఆకులు, ధనియాలు వేసి కషాయం తయారు చేసుకుని తాగాలి. రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా నలిపి తిని ఒక గ్లాస్ నీటిని తాగాలి. పాలకూర జ్యూస్, పుదీనా చట్నీతో పోహా, ఇడ్లీ సాంబార్, ఊతప్పం, కొబ్బరి చట్నీ, స్టఫ్‌డ్ ఆమ్లెట్, ఒక గ్లాస్ మజ్జిగ వంటి ఆహారాలు తీసుకోవాలి. ఈ ఆహారాలన్నింటినీ తీసుకోవాల్సిన పనిలేదు. వీటిని ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకోవచ్చు. వీటిల్లో రెండు, మూడు ఆహారాలను రోజూ తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి.
ఇక బ్రేక్ ఫాస్ట్ అనంతరం ఒక గంట విరామం తరువాత కొబ్బరినీళ్లు, బీట్‌రూట్ జ్యూస్, పాలకూర జ్యూస్, ఉసిరికాయ జ్యూస్, కివీ, ఆరెంజ్, యాపిల్, బొప్పాయి, పైనాపిల్ వంటి పండ్లను తినవచ్చు.
లంచ్‌లో జీరా రైస్, వాముతో తయారు చేసిన చపాతీలు, రాజ్మా, క్యారెట్, పచ్చిబఠానీలతో తయారు చేసిన కూర, తాజా పెరుగు, ఎగ్ రైస్, మేథీ ఆలూ, ఏదైనా కూరగాయతో చేసిన కూర, శనగలు తీసుకోవచ్చు. లంచ్ అనంతరం ఒక టీస్పూన్ బెల్లంతో నెయ్యిని తీసుకోవాలి. అలాగే 2 ఖర్జూరాలు తినాలి.
సాయంత్రం స్నాక్స్ రూపంలో చిలగడ దుంపలు, శనగలు, రాజ్మా, మొక్కజొన్న, మొలకెత్తిన విత్తనాలు, ఏవైనా పండ్లు తినవచ్చు. అలాగే హెర్బల్ టీ, చికెన్ లేదా వెజిటబుల్ సూప్, దాల్ సూప్ తీసుకోవచ్చు.
రాత్రి భోజనంలో కిచ్‌డీ, పెసలు, అన్నం, చికెన్, వెల్లుల్లితో తయారు చేసిన చపాతీ, పనీర్, మిక్స్‌డ్ వెజిటబుల్స్ వంటివి తీసుకోవచ్చు. భోజనం అనంతరం పసుపు కలిపిన పాలు లేదా మిరియాల పాలు తాగాలి.
ఇక ఇవే కాకుండా రోజులో ఎప్పుడైనా సరే నిమ్మరసం, మజ్జిగ, పుచ్చకాయలు, పీనట్ బటర్, అరటి పండ్లు, వెజిటబుల్ జ్యూస్‌లు తీసుకోవాలి. అలాగే డాక్టర్ల సూచన మేరకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, జింక్ ఉండే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను వాడాలి. ఆహారంలో తృణ ధాన్యాలు, ఓట్స్ ఉండేలా చూసుకోవాలి. రోజూ 75-100 గ్రాముల ప్రోటీన్లు అందేలా చూసుకోవాలి. పప్పు దినుసులు, పాలు, పాల ఉత్పత్తులు, సోయా, నట్స్, విత్తనాలు, మాంసం, చికెన్, చేపలు, కోడిగుడ్లను తీసుకోవాలి. కనీసం 2-3 లీటర్ల నీటిని తాగాలి. ఇలా డైట్ పాటించడం వల్ల కోవిడ్ నుంచి కోలుకున్న బాధితులు ఆరోగ్యంగా ఉంటారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365