మన వంటింట్లో ఉండే దినుసుల్లో మెంతులు కూడా ఒకటి. మెంతులు చాలా చేదుగా ఉంటాయి. పులుసు కూరల్లో, నిల్వ పచ్చళ్లల్లో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటాము. చేదుగా ఉన్నప్పటికి మెంతులు వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుంది. అలాగే మెంతులను వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని తగ్గించడంలో, శరీరానికి చలువ చేయడంలో ఇలా అనేక రకాలుగా మెంతులు మనకు సహాయపడతాయి. అయితే వంటల్లో వాడడానికి బదులుగా మెంతులతో మెంతుల టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మెంతుల టీ ని తాగడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు మెంతుల టీ ని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే రోజూ తాగే టీ, కాఫీలకు బదులుగా మెంతుల టీ ని తాగడం వల్ల అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు. శరీరంలో జీవక్రియల రేటును పెంచి సులభంగా బరువు తగ్గేలా చేయడంలో మెంతుల టీ ఎంతో దోహదపడుతుంది. అలాగే జీర్ణశక్తిని మెరుగుపరచంలో, గ్యాస్, మలబద్దకం, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా మెంతుల టీ మనకు దోహదపడుతుంది. అంతేకాకుండా మెంతుల టీ ని తాగడం వల్ల కడుపులో పుండ్లు, అల్సర్లు వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఈ టీని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, అధిక రక్తపోటును తగ్గించడంలో కూడా మెంతులు మనకు దోహదపడతాయి. అదే విధంగా చర్మం మరియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. బాలింతలు ఈ టీని తాగడం వల్ల వారిలో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ విధంగా మెంతుల టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని రోజూ తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మెంతుల టీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని కోసం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ మెంతుల పొడి, ఒక టీ స్పూన్ తేనె వేసి బాగా కలిపి తాగాలి. ఈ టీ ని మరో విధంగా కూడా తీసుకోవచ్చు. దీని కోసం ఒక టీ స్పూన్ మెంతులను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ మెంతులను నీటితో సహా ఉడికించి వడకట్టి తేనె కలిపి తీసుకోవాలి. ఇలా ఏ విధంగా మెంతుల టీని తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.