Anemia : ప్రస్తుత తరుణంలో మనలో చాలా మంది రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలలో మనం రక్తహీనత సమస్యను అధికంగా చూడవచ్చు. సాధారణంగా పురుషులలో 5 లీటర్లు, స్త్రీలలో 4.50 లీటర్ల రక్తం ఉంటుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గడాన్ని రక్తహీనత సమస్యగా చెప్పవచ్చు. రక్తంలో వీటి స్థాయిలను పెంచడంలో ఐరన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్త హీనత కలిగిన వారు ఎక్కువగా ఐరన్ క్యాప్సుల్స్ ను, సిరప్ లను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎటువంటి మందులను వాడకుండా సహజ సిద్దమైన పద్దతిలో రక్త హీనత సమస్య నుండి మనం బయట పడవచ్చు.
సహజ సిద్దంగా దొరికే ఐరన్ ను కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనం రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు. ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. మన శరీరానికి ప్రతిరోజూ 30 మిల్లీ గ్రాముల ఐరన్ అవసరమవుతుంది. ఐరన్ ను అత్యధికంగా కలిగి ఉన్న ఆకుకూరలల్లో తోటకూర ఒకటి. 100 గ్రా. ల తోటకూరలో 39 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. ఐరన్ క్యాప్సుల్స్ ను, సిరప్ లను తీసుకోవడం వల్ల మన శరీరానికి కేవలం ఐరన్ మాత్రమే లభిస్తుంది. కానీ తోటకూరను తినడం వల్ల 400 మిల్లీ గ్రాముల క్యాల్షియం, శరీరానికి కావల్సినంత విటమిన్ ఎ, సోడియం కూడా లభిస్తాయి.
తోటకూరను ప్రతిరోజూ పిల్లలకు ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల శరీరానికి కావల్సినంత ఐరన్ లభించడంతోపాటు రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. తోటకూరతోపాటు కాలీఫ్లవర్ లో కూడా ఐరన్ అధికంగా ఉంటుంది. కాలీఫ్లవర్ లో 40 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. కానీ వీటిని మనం ఆహారంగా తీసుకోము. వారానికి మూడు లేదా నాలుగు సార్లు కాలీఫ్లవర్ ను కూరగా చేసుకుని తినడం వల్ల శరీరానికి కావల్సినంత ఐరన్ లభించడంతోపాటు రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.
ఇక వీటన్నింటి కంటే కూడా అవిసె గింజలలో అత్యధికంగా ఐరన్ ఉంటుంది. 100 గ్రా. అవిసె గింజలల్లో 100 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. ఈ అవిసె గింజలను కారం పొడిలా లేదా లడ్డూలలా చేసుకుని కూడా తినవచ్చు. వీటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడంతోపాటు పిల్లలకు కూడా వీటిని ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల ఎటువంటి మందులను వాడాల్సిన పని లేకుండా నెల రోజులల్లోనే హిమోగ్లోబిన్ శాతం పెరగడంతోపాటు.. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.