Fat : మనలో చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికి బరువు తగ్గడం లేదని ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి బరువు తగ్గకపోతే వారిలో వైట్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ ఫ్యాట్ ఉన్నవారు వేగంగా బరువు తగ్గుతారు. కొవ్వు నిల్వ ఉండే కొద్ది బ్రౌన్ ఫ్యాట్ కూడా వైట్ ఫ్యాట్ గా మారుతుంది. వైట్ ఫ్యాట్ చాలా నెమ్మదిగా కరుగుతుంది. శరీరంలో వైట్ ఫ్యాట్ పేరుకుపోయిన వారు చాలా నెమ్మదిగా బరువు తగ్గుతారు. 5 రకాల నియమాలను పాటించడం వల్ల వైట్ ఫ్యాట్ పేరుకుపోయిన వారు కూడా చాలా సులభంగా తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం లేదని నిరుత్సాహ పడితే ఎప్పటికి తగ్గరని మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కనీసం రెండు గంటల పాటు వ్యాయామాలు చేయాలి.
జాగింగ్, రన్నింగ్, సూర్య నమస్కారాలు, ఫిజికల్ యాక్టివిటీస్ ఇలా ఏదైనా కనీసం రెండు గంటల పాటు చేయాలి. అలాగే ఎప్పుడూ ఒకే రకమైన వ్యాయామం చేయడం కూడా మార్చి మార్చి చేస్తూ ఉండాలి. వ్యాయామం చేసేటప్పుడు ఐరిసిన్ అనే రసాయన సమ్మేళనం విడుదలై రక్తంలో కలుస్తుంది. ఈ రసాయన సమ్మేళనం శరీరంలో కొవ్వు త్వరగా కరిగేలా చేయడంలో సహాయపడుతుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన వైట్ ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది. అలాగే శరీరానికి చల్లటి గాలి ఎక్కువగా తగిలేలా చూసుకోవాలి. చల్లగాలి తగలడం వల్ల శరీరం ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరించుకునే ప్రయత్నం చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన వైట్ ఫ్యాట్ కరిగి అప్పటికప్పుడు శరీరం వేడిగా తయారవుతుంది. టబ్ లో చల్లటి నీటిని పోసి 20 నిమిషాల పాటు ఆ నీటిలో కూర్చోవడం వల్ల కూడా శరీరంలో పేరుకుపోయిన వైట్ ఫ్యాట్ కరిగిపోతుంది.
అలాగే ఫ్యాట్, కార్బో హైడ్రేట్స్ ను తక్కువగా ఫైబర్, ప్రోటీన్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ శరీరానికి అందించడం లేదు కనుక శరీరంలో పేరుకుపోయిన వైట్ ఫ్యాట్ కరిగి శక్తిగా మారుతుంది. శరీరం తనకు కావల్సిన శక్తిని పేరుకుపోయిన కొవ్వు నుండి గ్రహిస్తుంది. దీంతో మనం చాలా త్వరగా బరువు తగ్గవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, మొలకెత్తిన గింజలు, తాజా డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అదే విధంగా మానసిక ఒత్తిడికి చాలా దూరంగా ఉండాలి. ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో కార్టిజాల్ స్థాయిలు ఎక్కువగా పెరిగి కొవ్వు ఎక్కువగా పేరుకుపోయేలా చేస్తుంది. ప్రాణాయామం, యోగా వంటి వాటిని అభ్యసించాలి. దీంతో ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
అదే విధంగా వారానికి ఒకసారి ఉపవాసం చేయాలి. ఇలా చేయడం వల్ల వైట్ ఫ్యాట్ కరిగి శక్తిలా మారుతుంది. అదే విధంగా ఉదయం పూట ఎటువంటి ఆహారాలను తీసుకోకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసిన తరువాత ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ఎక్కువగా కరగుతుంది. శరీరంలో వైట్ ఫ్యాట్ ఎక్కువగా పేరుకుపోయి ఇబ్బంది పడుతున్న వారు ఈ నియమాలను పాటించడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.