Body Cool : ప్రస్తుతం ఎండలు ఎంత మండిపోతున్నాయో అందరికీ తెలిసిందే. ఈ ఎండల కారణంగా ప్రజలు అందరు అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం లేదా సాయంత్రం సమయంలోనే బయటకు వచ్చి పనులను చక్కబెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయే పురాతన ఆయుర్వేద పద్ధతులను పాటిస్తే చాలు, దాంతో ఎండ వేడిని తిప్పికొట్టవచ్చు. ఎంత వేడి ఉన్నా సరే మీ శరీరం మాత్రం చల్లగానే ఉంటుంది. అందుకు ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో శరీరం నుంచి నీరు త్వరగా బయటకు పోతుంది. కనుక బయటకు పోయే నీటి శాతాన్ని త్వరగా భర్తీ చేయాలి. అందుకు గాను నీళ్లను అధికంగా తాగాలి. అలాగే పుచ్చకాయ, తర్బూజా, కీరదోసలను అధికంగా తినాలి. ఇవి ఎండ వేడి నుంచి మనల్ని కాపాడుతాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తాయి. దీంతో బయట ఎంత ఎండ ఉన్నా సరే మన శరీరం నుంచి నీరు అధికంగా బయటకు పోకుండా ఉంటుంది. దీని వల్ల శరీరం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. ఎండదెబ్బ బారిన పడకుండా ఉంటారు. ఇక వాటితో జ్యూస్ అయినా చేసుకుని తాగవచ్చు.
భోజనం అనంతరం చల్లని మజ్జిగను సేవించాలి. అందులో పుదీనా ఆకులను కలిపి తాగితే ఇంకా మేలు. దీంతో శరీరంలో వేడి ఉత్పత్తి అవకుండా ఉంటుంది. ఫలితంగా శరీరం చల్లగా ఉంటుంది. ఎండ దెబ్బ నుంచి సురక్షితంగా ఉండవచ్చు. కొత్తిమీర ఆకులు, సోంపు గింజలు, గులాబీ పువ్వుల రెక్కలతో తయారు చేసిన హెర్బల్ టీలను తాగాలి. ఇవి కూడా వేసవి తాపాన్ని తగ్గిస్తాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అలాగే బయటకు వెళ్లినప్పుడు చర్మం ఎండ బారిన పడకుండా ఉండేందుకు గాను అలోవెరా లేదా శాండల్‌వుడ్ పేస్ట్‌ను చర్మానికి రాయాలి. వదులుగా ఉండే దుస్తులను ధరించాలి, కళ్లకు రక్షణగా చలువ కళ్లద్దాలను ధరించాలి. తలపై టోపీ ఉండాలి. దీంతో శరీరం వేడికి గురి కాకుండా ఉంటుంది.
ఇక రోజులో కనీసం ఒకటి లేదా రెండు కొబ్బరి బొండాలను తాగాలి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అలాగే ఈ సీజన్‌లో కారం, మసాలాలు, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు, నూనె పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఇవి వేడి చేసే స్వభావం కలవి. కనుక వీటిని పూర్తిగా మానేస్తేనే బెటర్. ఇక వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు ఆయిల్ మసాజ్ చేసుకుని స్నానం చేస్తే మంచిది. ఇది పురాతన ఆయుర్వేద పద్ధతి. దీంతో శరీరం చల్లగా మారుతుంది. బ్రహ్మి, శతావరి, గుడూచి వంటి ఆయుర్వేద మూలికలు చల్లని స్వభావాన్ని పెంచుతాయి. వీటిని డాక్టర్ సూచన మేరకు వాడుకుంటే శరీరం చల్లగా ఉంటుంది.