Hotel Style Chutney Without Coconut : చాలా మంది సహజంగానే రోజూ ఉదయం అనేక రకాల బ్రేక్‌ఫాస్ట్‌లను చేస్తుంటారు. చాలా మంది ఎక్కువగా తినే బ్రేక్‌ఫాస్ట్‌లలో ఇడ్లీలు, దోశలు కూడా ఒకటి. వీటిల్లోనూ మనకు అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇడ్లీలు లేదా దోశలు ఏవి చేసినా సరే వాటిల్లోకి తినే చట్నీ బాగుండాలి. అప్పుడే ఆ ఆహారాలు రుచిగా ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు టిఫిన్లలోకి కొబ్బరి చట్నీ చేస్తారు. కొందరు పల్లి చట్నీ అంటే ఇష్టపడతారు. అయితే కొబ్బరి వాడకుండా హోటల్ స్టైల్‌లో ఇలా చట్నీ చేసి ఒక్కసారి తిని చూడండి. ఎంతో బాగుంటుంది. తరువాత కూడా మీరు ఇలాగే చట్నీ చేసుకుంటారు. ఇక హోటల్ స్టైల్‌లో టిఫిన్ చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హోటల్ స్టైల్ టిఫిన్ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యారెట్లు – 2 (మీడియం సైజువి, పొట్టు తీసి సన్నగా తరగాలి), బాగా పండిన టమాటాలు – 2 (సన్నగా తరగాలి), ఉల్లిపాయ – 1 (చిన్నది, సన్నగా తరగాలి), వెల్లుల్లి – 2 లేదా 3 రెబ్బలు, అల్లం – 1 ఇంచు ముక్క (సన్నగా తరగాలి), ఎండు మిర్చి – 2 లేదా 3, నూనె – 1 టేబుల్ స్పూన్, ఆవాలు – 1 టీస్పూన్, మినప పప్పు – 1 టీస్పూన్, ఇంగువ – చిన్న ముక్క, ఉప్పు – రుచికి సరిపడా, నీరు – తగినన్ని, కొత్తిమీర ఆకులు – తగినన్ని (గార్నిష్ కోసం).
హోటల్ స్టైల్ టిఫిన్ చట్నీని తయారు చేసే విధానం..
క్యారెట్లు, టమాటాలను నీళ్లలో వేసి బాగా ఉడికించాలి. అనంతరం చల్లారాక వాటి పొట్టు తీసి వాటిని సన్నగా ముక్కలుగా తరగాలి. తరువాత మిక్సీలో క్యారెట్లు, టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అ్లలం, ఎండు మిర్చి వేసి బాగా పట్టాలి. మీకు బరకగా కావాలనుకుంటే కాసేపు మిక్సీ వేయాలి. లేదంటే స్మూత్ పేస్ట్‌లా కూడా పట్టుకోవచ్చు. అవసరం అనుకుంటే అందులో నీళ్లను కూడా కలపవచ్చు. తరువాత ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు వేసి చిటపటలాడించాలి. తరువాత అందులోనే మినప పప్పు వేసి అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
అందులోనే ఇంగువ వేసి కాసేపు వేయించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో పోయాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేయాలి. తరువాత చట్నీని 5 నుంచి 7 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతుండాలి. చట్నీ గట్టి పడి పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి. తరువాత అవసరం అనుకుంటే మరిన్ని నీళ్లను జోడించవచ్చు. అనంతరం కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేయాలి. అంతే వేడి వేడి చట్నీ రెడీ అవుతుంది. దీన్ని వేడిగా ఇడ్లీలు లేదా దోశల్లో తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు.