Teeth Sensitivity : మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవ్వడంలో దంతాలు కీలక పాత్ర పోషిస్తాయి. దంతాల సహాయంతో ఆహారాన్ని బాగా నమలడం వల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కానీ ప్రస్తుత తరుణంలో చాలా మంది దంతాల సమస్యలతో బాధపడుతున్నారు. చల్లని – వేడి పదార్థాలను తిన్నప్పుడు దంతాలు జివ్వుమనడం ఈ సమస్యల్లో ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు కూడా రోజురోజుకీ ఎక్కువవుతున్నారు. పిల్లల్లో కూడా ఈ సమస్యను మనం ఎక్కువగా చూడవచ్చు. ఈ సమస్య రావడానికి కారణం మన దంతాలపై ఉండే ఎనామిల్ అనే పొర దెబ్బతినడమే.
మన దంతాలపై 2.5 ఎమ్ఎమ్ మందంతో ఎనామిల్ పొర ఉంటుంది. ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఎనామిల్ 150 సంవత్సరాల వరకు కూడా మట్టిలో కలవదు. 1000 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను కూడా ఎనామిల్ తట్టుకుంటుంది. దంతాలపై ఉండే ఈ ఎనామిల్ పొర దెబ్బ తినడం వల్ల చల్లని పదార్థాలను తిన్నప్పుడు దంతాలు జివ్వుమనే బాధ కలుగుతుంది. ఈ ఎనామిల్ పొర దెబ్బ తినడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే అని చెప్పవచ్చు. యాసిడ్లు, రసాయనాలు ఎక్కువగా కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎనామిల్ దెబ్బ తింటుంది.
శీతల పానీయాలు యాసిడ్లను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ యాసిడ్లలో ఉండే గాఢత కారణంగా దంతాలపై ఉండే ఎనామిల్ కరిగిపోతుంది. అతి చల్లదనం కూడా ఎనామిల్ దెబ్బతినడానికి ఒక కారణం. ఐస్ క్రీమ్స్, చాకొలెట్స్, బిస్కెట్లు, కేకులు, జామ్ లలో ఉండే పంచదార, రసాయనాలు దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బ తినేలా చేస్తాయి. దీని కారణంగా చల్లని పదార్థాలను తిన్నప్పుడు దంతాలు జివ్వుమంటాయి.
మార్కెట్ లో దొరికే టూత్ పేస్ట్ లను వాడడం వల్ల తాత్కాలికమైన ప్రయోజనమే ఉంటుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండదు. దంతాలపై నుండి కోల్పోయిన ఎనామిల్ ను తిరిగి పొందలేము. దంతాలపై ఉండే ఎనామిల్ ను కాపాడుకోవడానికి యాసిడ్లు, రసాయనాలు కలిగి ఉన్న ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఆయుర్వేద టూత్ పేస్ట్‌లను వాడడం వల్ల దంతాలపై మిగిలి ఉన్న ఎనామిల్ దెబ్బ తినకుండా ఉంటుంది.
ఫైబర్ అధికంగా ఉండే చెరుకు ముక్కలు, దానిమ్మ గింజలు, బత్తాయి తొనలు, సలాడ్స్, మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల దంతాలపై మిగిలి ఉన్న ఎనామిల్ ను కాపాడుకోవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నోటిలో ఉండే బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. దంత క్షయం రాకుండా ఉంటుంది. ఈ సూచనలను పాటించడం వల్ల ఎనామిల్ దెబ్బ తినకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.