Majjiga Charu : సాధారణంగా కూరలతో భోజనం చేసిన తరువాత పెరుగుతో కూడా భోజనం చేసే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. పెరుగుతో భోజనం చేయనిదే చాలా మందికి భోజనం చేసినట్టుగా ఉండదు. పెరుగును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. విటమిన్ బి12 తోపాటుగా కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం వంటి మినరల్స్ పెరుగులో అధికంగా ఉంటాయి. శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరుగులో అధికంగా ఉంటుంది. జీర్ణ క్రియను మెరుగుపరచడంలోనూ ఈ బ్యాక్టీరియా ఎంతగానో సహాయపడుతుంది. దీని వల్ల అజీర్తి, గ్యాస్ వంటి సమస్యల నుండి బయట పడవచ్చు.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో పెరుగు ఎంతగానో సహాయపడుతుంది. పెరుగును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల దీనిలో ఉండే కాల్షియం దంతాలను, ఎముకలను ధృడంగా చేస్తుంది. బరువును తగ్గించడంలోనూ పెరుగు ఉపయోగపడుతుంది. వేసవి కాలంలో ఎక్కువగా పెరుగుతో మజ్జిగ, లస్సీ వంటి వాటిని చేసి తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి లభించడంతోపాటు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. పెరుగుతో లస్సీ, మజ్జిగనే కాకుండా చారును కూడా చేసుకోవచ్చు. భోజనంలో భాగంగా అన్నంతో కలిపి పెరుగుతో చేసిన చారును తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పెరుగు చారును (మజ్జిగ చారు) తయారు చేసుకునే విధానాన్ని, తయారీకి కావల్సిన పదార్థాల గురించి తెలుసుకుందాం.
మజ్జిగ చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ – అర కప్పు, తరిగిన పచ్చి మిర్చి – ఒక టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, నీళ్లు – ఒక గ్లాసు.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 2, జీలకర్ర – పావు టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, ఇంగువ – పావు టీ స్పూన్, తరిగిన కొత్తి మీర – కొద్దిగా, పసుపు – అర టీ స్పూన్.
మజ్జిగ చారు తయారు చేసే విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పెరుగులో నీళ్లు పోసి మజ్జిగలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయిలో నూనె వేసి కాగాక మిగిలిన పదార్థాలు అన్నీ వేసి తాళింపు వేసుకోవాలి. ఈ తాళింపును ముందుగా తయారు చేసి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. దీంతో చక్కటి వాసనతో, ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారు తయారవుతుంది. ఈ చారును అన్నంతో కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. దీంతోపాటుగా పెరుగులో ఉండే పోషకాలన్నీ శరీరానికి లభిస్తాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలోనూ పెరుగు ఉపయోగపడుతుంది. చుండ్రును నివారిస్తుంది. పెరుగును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.