Dhanurasana : యోగాలో అనేక రకాల ఆసనాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ధనురాసనం ఒకటి. రోజూ ఉదయాన్నే ఈ ఆసనం వేయడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. ధనురాసనం వేయడం చాలా కష్టమని చాలా మంది భావిస్తుంటారు. కానీ రోజూ ప్రాక్టీస్ చేస్తే ఈ ఆసనం వేయడం చాలా సులభమే అని చెప్పవచ్చు. ఇక ఈ ఆసనం ఎలా వేయాలో.. దీంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ధనురాసనం వేసే విధానం..
ధనురాసనం వేసేందుకు ముందుగా నేలపై బోర్లా పడుకోవాలి. తరువాత కాళ్లను వెనక్కి వంచి చిత్రంలో చూపినట్లుగా రెండు చేతులతో రెండు పాదాలను పట్టుకోవాలి. ఈ దశలో తల, ఛాతి, తొడలను పైకెత్తాలి. తరువాత పొట్ట మీద భారం పడేలా చూడాలి. ఈ భంగిమలో 15 నుంచి 20 సెకన్ల పాటు ఉండాలి. తరువాత ఊపిరి నెమ్మదిగా వదిలేస్తూ తిరిగి బోర్లా స్థితికి రావాలి. ఈ ఆసనాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో కనీసం 10 సార్లు లేదా 10 నిమిషాల పాటు చేయాలి.
ఆరంభంలో ఈ ఆసనం వేసేందుకు కష్టంగా ఉంటుంది. కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా సులభంగా ధనురాసనం వేయవచ్చు. పెద్ద కష్టమేమీ కాదు. ఇక ఈ ఆసనం వేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ధనురాసనం వేయడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.
2. పొట్ట ద్గగర ఉండే కొవ్వు మొత్తం కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరం చక్కని ఆకృతిని పొందుతుంది.
3. ఈ ఆసనం వేయడం వల్ల పొట్ట దగ్గరి కండరాలు దృఢంగా మారుతాయి. కండరాలు, ఎముకలు సులభంగా సాగుతాయి.
4. ఈ ఆసనం వేస్తే వెన్ను నొప్పి సమస్య రాకుండా ఉంటుంది. చేతులు, తొడలు గట్టిపడతాయి. స్త్రీలలో నెలసరి సరిగ్గా వస్తుంది.
5. వెన్నెముక దృఢంగా మారుతుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఆకలి నియంత్రణలోకి వస్తుంది. ఆకలి లేని వారికి ఆకలి పెరుగుతుంది.
పొట్ట నొప్పి, అల్సర్లు, వెన్ను సమస్యలు, మైగ్రేన్, లో బీపీ వంటి సమస్యలు ఉన్నవారు ధనురాసనం వేయరాదు.