అధిక బరువుతో ఎలాంటి సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే. గుండె జబ్బులు, డయాబెటిస్ వంటివి ఎప్పుడు దాడి చేద్దామా అన్నట్టుగా పొంచి ఉంటాయి. ఈ క్రమంలో బరువు తగ్గించుకోవడం స్థూలకాయులకు అత్యంత ఆవశ్యకంగా మారింది. అయితే వీరిలో ప్రధానంగా కనిపించేది పొట్ట. దాని దగ్గర పేరుకుపోయిన కొవ్వు. కొవ్వు అలా పేరుకుపోవడానికి ప్రధాన కారణం జంక్‌ఫుడ్, కార్బొహైడ్రేట్లు, చక్కెరతో తయారు చేసిన పదార్థాలను అధికంగా తినడమే. దీంతో శరీరంలో విష పదార్థాలు కూడా పేరుకుపోతాయి. అయితే ఈ విష పదార్థాలనే కాదు, కొవ్వును కూడా మనం కేవలం 3 రోజుల్లోనే తగ్గించుకోవచ్చు. అదెలాగంటే…
శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరగాలన్నా, విష పదార్థాలు పోవాలన్నా చక్కెరతో తయారు చేసిన పదార్థాలను పూర్తిగా మానేయాలి. దీనికి తోడు పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే అన్నం వంటి ఆహార పదార్థాలను, జంక్ ఫుడ్‌ను అస్సలు తీసుకోవద్దు. 3 రోజుల పాటు కింద చెప్పిన విధంగా ఆహార పదార్థాలను తీసుకోవాలి.
ఉదయం పూట ఓట్స్‌తో బాదం పప్పు లేదా బెర్రీలు, స్క్రాంబుల్డ్ ఎగ్స్‌ను తీసుకోవాలి. 2, 3 గుడ్లను పగలగొట్టి అందులో పాలు, ఉప్పు, మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని కడాయ్‌లో వేసి వేడి చేయాలి. దీంతో స్క్రాంబుల్డ్ ఎగ్స్ తయారైపోతుంది. ఉదయం అల్పాహారం తరువాత మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక కప్పు నట్స్‌ను స్నాక్స్‌గా తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనంలో ఉడికించిన ఎర్ర ముల్లంగి దుంప (తుర్నిప్స్), క్యారెట్స్, బీట్‌రూట్, బీన్స్, బాదం పప్పు, చికెన్ బ్రెస్ట్ వంటి వాటిని తీసుకోవాలి.
రాత్రి భోజనంలో చేపలతో బీన్స్, పుట్ట గొడుగులు, బ్రకోలి వంటి వాటిని తినాలి. ఈ విధంగా మూడు రోజుల పాటు ఆహారం తీసుకుంటే వచ్చే మార్పును మీరే గమనిస్తారు. దీంతో విష పదార్థాలు, కొవ్వు శరీరం నుంచి బయటికి వెళ్లిపోతాయి.