Foods For Long Hair : మన జుట్టు ఆరోగ్యం, అందం మనం తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందని మనలో చాలా మందికి తెలియదు. జుట్టు అందంగా ఉండడానికి అనేక రకాల షాంపులను, ట్రీట్ మెంట్ లను, నూనెలను వాడుతూ ఉంటారు. వీటితో పాటు మనం తీసుకునే ఆహారం సరిగ్గా ఉంటేనే జుట్టుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. జుట్టు పెరుగుదలకు కెరాటిన్ అనే ప్రోటీన్ అవసరమవుతుంది. అలాగే అనేక రకాల విటమిన్స్, మినరల్స్ కూడా అవసరమవుతాయి. ఇవన్నీ మన జుట్టుకు అందితేనే జుట్టు పెరుగుదల చక్కగా ఉంటుంది. జుట్టు పెరుగుదల చక్కగా ఉండాలనుకునే వారు ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకోవాలి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టుకు కావల్సిన పోషకాలన్నీ చక్కగా అందుతాయి. దీంతో జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
జుట్టు పెరుగుదల చక్కగాఈ ఉండాలంటే మనం తీసుకోవాల్సిన ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆహారంలో భాగంగా రోజూ గుడ్డును తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల చక్కగా ఉంటుంది. గుడ్డులో మన జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. గుడ్డును తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా, ధృడంగా ఉంటాయి. అలాగే ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. జుట్టు ఎదుగుదలకు ఐరన్ చాలా అవసరం. ఐరన్ లోపించడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కనుక శరీరంలో ఐరన్ లోపం లేకుండా ఉండాలంటే మనం ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మనం తీసుకునే ఐరన్ మన శరీరానికి అందాలంటే మన శరీరంలో తగినంత విటమిన్ సి ఉండేలా చూసుకోవాలి. విటమిన్ సి ఉండే నిమ్మజాతికి చెందిన పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
వీటిని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం లేకుండా ఉండడంతో పాటు కొల్లాజెన్ కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు త్వరగా పెరుగుతుంది. అదే విదంగా మన జుట్టు పెరుగుదలకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఎంతో అవసరమవుతాయి. కనుక ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే బాదం, వాల్ నట్స్, అవిసె గింజలు వంటి వాటిని ఆహారంగా తీసుకోవాలి. ఇక మన జుట్టు పెరుగుదలకు బయోటిన్ కూడా చాలా అవసరం. బయోటిన్ ఎక్కువగా తృణ ధాన్యాల్లో ఉంటుంది. కనుక తృణ ధాన్యాలను కూడా మనం తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. అలాగే జుట్టు పెరుగుదలకు, తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, జుట్టు కుదుళ్లను బలంగా ఉంచడంలో విటమిన్ ఎ ఎంతో సహాయపడుతుంది.
విటమిన్ ఎ ఎక్కువగా క్యారెట్ లో ఉంటుంది. కనుక క్యారెట్ ను సలాడ్ రూపంలో తీసుకోవడం, జ్యూస్ రూపంలో తీసుకోవడం వంటివి చేయాలి. ఇకజుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ ఇ కూడా ఒకటి. జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణను పెంచడంలో, తల చర్మం యొక్క పిహెచ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో విటమిన్ ఇ సహాయపడుతుంది. కనుక విటమిన్ ఇ ఎక్కువగా ఉండే అవకాడోను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దీనిని స్మూతీలల్లో లేదా సలాడం వంటి వాటిలో కలిపి తీసుకోవాలి. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు కావల్సిన పోషకాలన్నీ చక్కగా అందుతాయి. దీంతో జుట్టు పెరుగుదల చక్కగా ఉండడంతో పాటు జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.