Foods For Women : మన శరీరం సక్రమంగా పని చేయడానికి ఎన్నో పోషకాలు అవసరమవుతాయి. పోషకాలు సరిగ్గా అందితేనే మన శరీరం తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ మనలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. పోషకాహార లోపం వల్ల స్త్రీలు మరిన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. కనుక స్త్రీలు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. సమతుల్య ఆహారం వివిధ దశలల్లో ఉన్న మహిళల పూర్తి ఆరోగ్యం మరియు శ్రేయస్సును పెంపొందిచడంలో తోడ్పడుతుంది. కనుక మహిళలు పోషకాహార లోపం తలెత్తకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.
తగినన్ని పోషకాలు శరీరానికి అందేలా చూసుకోవాలి. మహిళలు రోజూ తీసుకోవాల్సిన పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలు తప్పకుండా తీసుకోవాల్సిన పోషకాల్లో క్యాల్షియం కూడా ఒకటి. ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఎముకలు గుళ్లబారకుండా కాపాడడంలో క్యాల్షియం దోహదపడుతుంది. ముఖ్యంగా మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు క్యాల్షియం కలిగిన ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. అలాగే మహిళలు ముఖ్యంగా ఐరన్ లోపం తలెత్తకుండా చూసుకోవాలి. మహిళల్లో ఐరన్ లోపం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి. మాంసం, బీన్స్, ఆకుకూరలు, కాయధాన్యాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.
అలాగే విటమిన్ బి9 ( ఫోలేట్) ఉండే ఆహారాలను తీసుకోవాలి. స్త్రీలల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, గర్భధారణ సమయంలో, పిండం అభివృద్దికి ఫోలేట్ ఎంతో అవసరం. ఆకుకూరలు, నిమ్మజాతికి చెందిన పండ్లు, తృణ ధాన్యాలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఫోలేట్ అందుతుంది. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అవిసె గింజలు, చియా విత్తనాలు, వాల్ నట్స్, సాల్మన్ చేపలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. ఇక ఎముకలను ధృడంగా ఉంచడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ డి ఎంతో అవసరమవుతుంది. రోజూ ఎండలోకూర్చోవడం, పాలు మరియు పాల ఉత్పత్తులు, చేపలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల తగినంత విటమిన్ డి అందుతుంది.
అలాగే మహిళలు మెగ్నీషియం ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. కండరాలు మరియు నరాల పనితీరుకు ఇది ఎంతో అవసరం. ఆకుకూరలు, గింజలు, తృణ ధాన్యాలు, చిక్కుళ్లు వంటిని రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఇక చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి గానూ విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవాలి. నిమ్మజాతికి చెందిన పండ్లను, బెల్ పెప్పర్స్, బ్రోకలి వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ సి అందుతుంది. అదే విధంగా రోజూ ప్రోటీన్ ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. కండరాల నిర్వహణలో, హార్మోన్ల ఉత్పత్తికి, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇలా అనేక రకాలుగా ప్రోటీన్ మనకు అవసరమవుతుంది.
ఇక శరీర బరువును అదుపులో ఉంచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఫైబర్ ఎంతో అవసరం. కనుక స్త్రీలు ఫైబర్ ఉండే ఆహారాలను కూడా తప్పకుండా తీసుకోవాలి. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, గాయాలు త్వరగా నయం అయ్యేలా చేయడంలో జింక్ మనకు ఎంతో సహాయపడుతుంది. కనుక జింక్ ఉండే ఆహారాలైనటువంటి పాలు, గింజలు, తృణ ధాన్యాలు వంటి వాటిని రోజూవారి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. మహిళలు రోజూ ఇలా అన్ని రకాల పోషకాలు ఉండేలా సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.