Grilled Chicken For Weight : ప్రస్తుత తరుణంలో పెరుగుతున్న ఆరోగ్య స్పృహ వలన చాలా మంది తమ బరువు తగ్గించుకోవడానికి ఎన్నో రకాల పద్దతులను పాటిస్తున్నారు. ఈ విషయంలో ఎంతో మందికి వివిధ రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. కొంత మంది రోజూ తమ బరువును చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ వారానికి ఒక రోజు బరువు చూసుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఆరు నెలలలో 5 నుండి 10 శాతం మాత్రమే బరువు తగ్గడం శ్రేయష్కరం అని కూడా చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.
ఆకలి తగ్గించుకొని తద్వారా బురువు తగ్గడానికి కొంతమంది భోజనానికి ముందు నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ ఇలా నీళ్లు ఎక్కువగా తాగడం వలన ఆరోగ్యానికి జరిగే మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు. ఎక్కువ నీరు తీసుకోవడం వలన కిడ్నీ సంబంధ ఇంకా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అదే విధంగా గ్రిల్డ్ చికెన్ ఎంత మోతాదులో తీసుకున్నప్పటికీ బరువు పెరగమని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది వాస్తవం కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. స్కిన్ లెస్, బోన్ లెస్ చేసిన గ్రిల్డ్ చికెన్ లో కొవ్వు తక్కువ ఉండడంతో పాటు పుష్కలమైన ప్రోటీన్లు ఉంటాయి. కానీ ఒక 85 గ్రాముల గ్రిల్డ్ చికెన్ లో 102 క్యాలరీలు ఉంటాయి. అందువలన ఇది మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
రాత్రి భోజనం మానేయడం వలన కూడా బరువు తగ్గవచ్చని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ సేపు కడుపును ఖాళీగా ఉంచడం వలన వ్యతిరేక ఫలితాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పోషకాల లోపం తలెత్తి బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెబుతున్నారు.
అయితే ప్రతి భోజనాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకొని తక్కువ క్యాలరీలు ఉండే విధంగా తీసుకోవడం వలన బరువు తగ్గవచ్చని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. అంతే కాకుండా తృణ ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలైనవి ఆహారంలో భాగం చేసుకోవాలి. చక్కెర, కొవ్వు, నూనె పదార్థాలు మొదలైనవాటికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇలాంటి పద్ధతులను పాటించడం వలన ఆరోగ్యకరమైన రీతిలో త్వరగా బరువు తగ్గవచ్చని సలహా ఇస్తున్నారు.