భారతీయులు తరచూ మినప పప్పును ఉపయోగిస్తుంటారు. ఈ పప్పుతో అనేక రకాల వంటకాలను చేసుకుంటారు. తీపి వంటకాలు కూడా తయారు చేసుకుని తింటారు. అయితే ఆయుర్వేద పరంగా చెప్పాలంటే మినప పప్పులో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. దీని వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పొట్టు తీయని మినప పప్పు అయితే మంచిది. అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కనుక మలబద్దకం సమస్య తగ్గుతుంది.
2. మినప పప్పులో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, ఐరన్, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. రక్తహీనత నుంచి బయట పడేస్తాయి. శరీరానికి శక్తిని అందిస్తాయి.
3. మినప పప్పులో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి దాన్ని ఫేస్ మాస్క్‌లా కూడా వేసుకోవచ్చు. దీంతో చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
4. కీళ్ల నొప్పులు ఉన్నవారికి మినప పప్పు ఎంతగానో మేలు చేస్తుంది. ఈ పప్పులో ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, మెగ్నిషియంలు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. నొప్పులను తగ్గిస్తాయి.
5. మినప పప్పును నీళ్లతో కలిపి పేస్ట్‌లా చేసి జుట్టుకు కూడా అప్లై చేయవచ్చు. తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.
మినప పప్పును ఒక చిన్న కప్పు మోతాదులో ఉడకబెట్టి అందులో కొద్దిగా ఉప్పు కలిపి తినవచ్చు. లేదా ఒక టేబుల్ స్పూన్ నెయ్యితో రెండు టేబుల్ స్పూన్ల మినప పప్పు కలిపి పెనంపై వేయించి తినవచ్చు. ఇక మినప పప్పును పిండి రూపంలోనూ ఉపయోగించవచ్చు.
మినప పప్పులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక మాంసాహారం తినలేని వారికి ఇవి మంచి ఆహారం అని చెప్పవచ్చు. దీంతో ప్రోటీన్లు లభిస్తాయి. మినప పప్పును పొట్టుతో తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఈ పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక పైల్స్ సమస్య కూడా తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ, వాపులు వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ పప్పును తీసుకోవచ్చు. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.