సాధారణంగా గాయాలు, పుండ్లు అయితే అనేక రకాలుగా వైద్యం చేయవచ్చు. అల్లోపతిలో అయితే ఆయింట్‌మెంట్‌లు రాస్తారు. అదే ఆయుర్వేదంలో అయితే పలు మూలికలకు చెందిన మిశ్రమాన్ని లేదా ఆకుల గుజ్జు వంటి వాటిని రాస్తారు. అయితే గాయాలు, పుండ్లు అయితే వాటిపై చేపల చర్మం వేస్తే.. అవి త్వరగా మానుతాయా ? అంటే.. అవును, మానుతాయి. కానీ అన్ని రకాల చేపలు అందుకు పనికిరావు. కేవలం తిలాపియా అనే రకానికి చెందిన చేపల చర్మాన్ని మాత్రమే గాయాలు, పుండ్లు మానేందుకు ఉపయోగిస్తారు.
తిలాపియా చేపల చర్మానికి, మనిషి చర్మానికి దగ్గరి పోలికలు ఉంటాయి. పైగా ఆ చేపల చర్మంలో నాన్ ఇన్ఫెక్షియస్ మైక్రోబయోటా ఉంటుంది. అంటే మనకు మంచి చేసే సూక్ష్మ జీవులు అన్నమాట. అందువల్ల తిలాపియా చేపల చర్మాన్ని గాయాలు, పుండ్లపై వేసి కట్టులా కడితే అవి త్వరగా మానుతాయి. ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఈ తరహా చికిత్సా విధానం అమలులో ఉంది.
అయితే ఆ చేపల చర్మాన్ని నేరుగా ఉపయోగించరాదు. వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవచ్చు. దాన్ని వారు స్టెరిలైజ్ చేస్తారు. తరువాత ఉపయోగిస్తారు. సాధారణంగా అల్లోపతిలో అయితే గాయాలు, పుండ్లపై సిల్వర్ సల్ఫడియాజైన్‌ను రాస్తారు. దీంతో గాయాలు, పుండ్లు 2 వారాల్లో మానుతాయి. అయితే బ్యాండేజ్ లను రోజూ మార్చాల్సి ఉంటుంది. గాయాలను రోజూ శుభ్రం చేయాలి. స్నానం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి.
కానీ తిలాపియా చేపల చర్మం అలా కాదు. నేరుగా అప్లై చేసి దానిపై బ్యాండేజ్ వేయవచ్చు. 10 రోజుల్లో గాయాలు, పుండ్లు నయమవుతాయి. కొందరికి ఇంకా వేగంగానే గాయాలు మానుతాయి. తిలాపియా చేపల చర్మంలో కొల్లాజెన్ టైప్ 1 అధిక స్థాయలో ఉంటుంది. ఇది గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేస్తుంది. అందువల్ల ఈ చేపల చర్మాన్ని ఒకసారి ఉపయోగిస్తే చాలు, చాలా త్వరగా గాయాలు, పుండ్లు మానుతాయి. అయితే ఇది కేవలం కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో ఉంది. చాలా మంది ఈ విధానాన్ని ఉపయోగించరు.
సూచన: ఈ వివరాలను వైద్య పరిజ్ఞానం కోసం మాత్రమే అందించడం జరిగింది. ఎవరూ అనుకరించవద్దు. వాడాలని అనుకుంటే వైద్యుల పర్యవేక్షణలో ఉపయోగించాలి.