నగరాలు, పట్టణాలలో, నేటి యువత తరచుగా గుండె సంబంధిత వ్యాధులకు గురవుతోంది. వీరికి గుండెపోటుకు కారణమైన డయాబెటీస్, స్మోకింగ్, కొల్లస్టరాల్, లేదా బ్లడ్ ప్రెజర్ వంటివి కూడా సూచనలుగా చూపటంలేదు. కాని వారి రక్తనాళాలు 100 శాతం మూసుకుపోవడం రక్తప్రసరణ ఆగిపోవటంతో గుండెపోటు మరణాలు వస్తున్నాయని వైద్యలు ఆశ్చర్యచకితులవుతున్నారు. ఈ రకంగా యువత గుండె జబ్బులకు గురికావటమనేది సరైన శారీరక వ్యాయామాలు లేకపోవటం, మనోవేదన, అనారోగ్య ఆహారాలు తినడం కారణాలుగా పరిశోధకులు చెపుతారు.
ఈ గుండె జబ్బులు నేడు గ్రామీణ ప్రాంతాలలో సైతం అధికంగానే వుంటున్నాయని నిపుణులు చెపుతున్నారు. మరణాల సంఖ్యలో అధికభాగం గుండెపోటు వలననే అని నానాటికి పెరుగుతున్న గుండె జబ్బుల రోగుల సంఖ్యకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ సైతం ఆందోళన చెందుతోంది. రోజువారీ జీవనంలోనే ఆందోళన, ఒత్తిడి పెరిగిన కారణంగా ఈ రకమైన గుండె సమస్యలు వస్తున్నాయని వీరి నివేదిక తెలుపుతోంది. ఒత్తిడే కాకుండా యువత అధిక నూనెల ఆహారాలు తీసుకోవడం, సామాజిక, ఆర్ధిక కారణాలు, గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన లేకపోవడం వంటివి కూడా వీరికి రిస్కు కలిగిస్తున్నాయన్నారు.
హస్పిటల్ కు వచ్చే వారిలో 20 శాతం యువకులేనని వీరు పురుషులు 40 లలోపు, స్త్రీలు 45 సంవత్సరాల వయసు లోపు వున్నవారేనని హాస్పిటల్ గణాంకాలు చెపుతున్నాయి. జీవన విధానాలు మారాలని, ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం, ఒత్తిడి, ఆందోళన లేని జీవనం, ప్రతిరోజూ తగినంత వ్యాయామం వంటివి యువతకు అవసరమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.