Home Made Coconut Oil : కొబ్బరి నూనె.. ఇది తెలియని వారుండరనే చెప్పవచ్చు. కొబ్బరి నూనె మనకు ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. ప్రతిరోజూ కొబ్బరి నూనెను వాడడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కొబ్బరి నూనె మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. 100 గ్రాముల కొబ్బరి నూనెలో 900 క్యాలరీల శక్తి ఉంటుంది. అలాగే 86.4 గ్రాముల స్యాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. కొబ్బరి నూనెను వాడడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రోజూ రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. చర్మాన్ని మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కొబ్బరి నూనె ఎంతో దోహదపడుతుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో కొబ్బరి నూనె సహాయపడుతుంది. అలాగే కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అల్జీమర్స్ వంటి సమస్యలు తగ్గుతాయి.
పిత్తాశయానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చేయడంలో, మూత్రాశయ ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో, బరువు తగ్గడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా కొబ్బరి నూనె మనకు సహాయపడుతుంది. కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. ఎముకలు ధృడంగా మారుతాయి. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. థైరాయిడ్, డయాబెటిస్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. కొబ్బరి నూనెను వాడడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.
మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ కొబ్బరి నూనెను మనం చాలా సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనెను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పచ్చి కొబ్బరిని సేకరించి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను ఒక కాటన్ వస్త్రంలోకి తీసుకుని చేత్తో గట్టిగా పిండుతూ కొబ్బరి పాలను తీసుకోవాలి. తరువాత ఈ కొబ్బరి పాలను కదిలించకుండా ఆరు గంటల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల నీళ్లు అడుక్కు పేరుకుపోతాయి. అలాగే కొబ్బరి మిశ్రమం పైన పేరుకుపోతుంది. ఇలా పేరుకుపోయిన కొబ్బరి మిశ్రమాన్ని నెమ్మదిగా సేకరించి కళాయిలో వేసుకోవాలి.
తరువాత దీనిని చిన్న మంటపై కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఇలా వేయించడం వల్ల కొబ్బరి మిశ్రమం నుండి కొబ్బరి నూనె వేరవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఒక జల్లిగంటెలోకి తీసుకుని నూనెను వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారవుతుంది. దీనిని గాజు సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి నూనెను వాడడం వల్ల మనం ఆరోగ్యంతో పాటు చక్కటి సౌందర్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. మార్కెట్ లో లభించే కల్తీ కొబ్బరి నూనెను వాడడానికి బదులుగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న కొబ్బరి నూనెను వాడడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.