గుడ్డు – ప్రాంతాలు, ప్రదేశాలు, వయసులతో సంబంధం లేకుండా మనం ఎంతో ఇష్టంగా తినే ఒకే ఒక ఆహారం. మనం తినే ఆహారపదార్థాలలో అత్యంత బలవర్ధకమైనది, రుచికరమైనది కూడా గుడ్డే. అందుకే ప్రపంచవ్యాప్తంగా గుడ్ల వాడకం గరిష్టస్థాయిలో ఉంది. ఎన్నో రకాల ఇతర ఆహారపదార్థాలను తయారుచేయడానికి కూడా గుడ్డును వాడతారని మనకు తెలుసు. స్వీట్లు, హాట్లు, స్నాక్స్… ఇలా ఎందులోపడితే అందులో విచ్చలవిడిగా వాడుతున్నారు. రుచికి రుచి, బలానికి బలం.. ఇంకేంకావాలి?
అయితే, ఇదే గుడ్డులో కొలెస్టరాల్, సంతృప్త కొవ్వులు ఉంటాయి. తగు మోతాదులో తీసుకుంటే ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవే కాకుండా, పొటాషియం, మెగ్నీనిషియం, రైబోఫ్లావిన్‌లతో పాటు, అత్యంత నాణ్యత కలిగిన మాంసకృత్తులను కూడా గుడ్లు కలిగివుంటాయి. అంతేకాదు, విటమిన్ ఏ, డి, బి6, బి12 ఇంకా ఇనుము, జింక్, భాస్వరం, ఫోలిక్ ఆమ్లం, పాంటోథెనిక్ ఆమ్లం, థియామైన్ కూడా గుడ్లలో లభిస్తాయి. ఈమధ్య జరిగిన పరిశోధనల్లో తేలిన అంశమేమిటంటే, ఆహారంగా తీసుకోదగిన కొలెస్టరాల్ వల్ల గుండెజబ్బులు, గుండెపోటు, రక్తపోటు లాంటివి వచ్చే అవకాశమేమీ లేదు. కాబట్టి, గుడ్లను తినడం వలన వచ్చే నష్టమేమీ లేదు. కాకపోతే మితంగా మాత్రమే తినడం మేలు.
ఒక గుడ్డులో 180 నుంచి 300 మిల్లీగ్రాముల కొలెస్టరాల్ ఉంటుంది. అదికూడా పచ్చసొనలోనే. తెల్లసొనలో అసలు కొలెస్టరాలే ఉండదు. జాతీయ పోషకాహార సంస్థ, భారత వైద్య పరిశోధన మండలి మార్గదర్శకాల ప్రకారం రోజుకు 300 మి.గ్రాల కొలెస్టరాల్ మాత్రమే తీసుకోవాల్సివుంటుంది. అంతమాత్రాన గుడ్లపై పడిపొమ్మని కాదు. ఎందుకంటే గుడ్లలో సంతృప్ల కొవ్వులు కూడా ఉంటాయి. అవి గుండె సంబంధిత రుగ్మతలను పెంచే అవకాశముంది.
వారానికి ఎన్ని తినాలి?
సంతులిత ఆహారంలో భాగంగా, రోజుకు ఒకటి చొప్పున వారానికి 3 లేదా 4 రోజలు తింటే పెద్దవాళ్లకు చాలా మంచిది. మళ్లీ ఇది ఇతరత్రా స్వీట్లు, వంటకాలతో కాదు. కేవలం ఉడకపెట్టినవి లేదా ఆమ్లెట్ రూపంలోనే. గుండెజబ్బులు ఉన్నవారు, చెడు కొలెస్టరాల్ ఎక్కువగా ఉన్నవారు వారానికి మూడింటికే పరిమితమైతే మంచిది. చిన్నపిల్లలు మాత్రం రోజుకొకటి తినేయొచ్చు.