Heat In Body : చురుకులు, పోట్లు, కళ్ల మంటలు, మూత్రంలో మంట, ముక్కు నుండి, చెవి నుండి, నోటి నుండి వేడి ఆవిర్లు రావడం, ఒళ్లంతా మంటలు పుట్టడం వంటి ఎన్నో లక్షణాలు శరీరంలో వేడి చేస్తే కనబడుతుంటాయి. ఎప్పుడూ జ్వరం వచ్చినట్టు ఉండడం, జలుబు, దగ్గు, ఆయాసం, మలమూత్రాల్లో మంటలు, కడుపులో యాసిడ్ స్థాయి పెరగడం, మాటి మాటికీ చిరు చెమటలు, గుండె దడ, దప్పిక, కళ్లు మసకగా కనిపించడం, తల తిరగడం, బీపీ పెరిగినట్టు అనిపించడం, కడుపులో మంట, గొంతులో మంట, ఒళ్లంతా మండినట్టు అనిపించడం వంటి వాటిని వేడి చేయడం అంటారు. వేడిని తగ్గించుకోకుండా అలాగే ఉంచితే చిన్న చిన్న లక్షణాలే ముదిరి పెద్ద వ్యాధులుగా తయారవుతాయి.
వేడి మితిమీరే కొద్దీ శరీరంలో జీవకణాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. రక్తహీనత, రక్తనాళాల వ్యాధులు త్వరగా సోకే అవకాశం ఉంటుంది. జీర్ణాశయం, కాలేయం, మూత్ర పిండాలు వంటి సున్నిత అవయవాలు అతి వేడి వల్ల త్వరగా దెబ్బతింటాయి. కనుక వేడిని తగ్గించే చర్యలు తీసుకోవడం అవసరం. వేడి చేసినప్పుడు చలువ చేసే పదార్థాలను తీసుకుంటూ, వేడి చేసే పదార్థాలను తినకుండా ఉంటూ శరీరాన్ని సమస్థితికి తీసుకురావడం చాలా అవసరం. మనం తీసుకునే ఆహారాల్లో పులుపు, అల్లం, మసాలాలు, నూనె ఎక్కువగా వాడిన పదార్థాలు, పచ్చళ్లు వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
ఉదయంపూట మనం తీసుకునే అల్పాహారాలు దాదాపు వేడి చేసేవే అయి ఉంటాయి. చివరికి ఇడ్లీని కూడా కారం పొడి, అల్లం చట్నీ వంటి వేడి చేసే పదార్థాలతో కలిపి తింటూ ఉంటాం. ఇక తరచూ వేడి చేస్తుంది అంటే వేడి శరీరతత్వం ఉందని అర్థం. ఇలాంటి వారు పులుపు, అల్లం వెల్లుల్లి వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. చింతపండు వేయని పప్పు చారు, సాంబార్ ను వాడాలి. వేడి శరీరతత్వం ఉన్నవారు పెసరకట్టు, కందికట్టు వాటిని తీసుకోవాలి. అలాగే పుచ్చకాయ, కర్బూజ, దానిమ్మ, కమలాపండ్లు, కీరదోస వంటి వాటిని తీసుకోవాలి.
కాఫీ, టీ, ఆల్కహాల్ కూడా వేడి చేస్తాయి. మజ్జిగ చలువ చేస్తుంది. ఉప్పు, కారం, పులుపు రుచులు వేడిని పెంచుతాయి. తీపి, వగరు రుచులు చలువ చేస్తాయి. సొరకాయ చలువ చేస్తుంది. కానీ వేడి చేసే పులుసు వేసి పులుసు కూర చేయడం వల్ల సొరకాయ కూడా వేడి చేసేదిగా మారిపోతుంది. క్యారెట్, ముల్లంగి, ఆపిల్ వంటి వాటిని జ్యూస్ గా చేసుకుని తాగినా కూడా వేడి తగ్గుతుంది. ధనియాలు, జీలకర్ర, శొంఠి.. ఈ మూడింటిని సమానంగా తీసుకుని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకుని తాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల వేడి తగ్గుతుంది. చింతపండు వేడి చేస్తుంది కనుక దీనికి బదులుగా టమాట, ఉసిరికాయలను వాడుకోవాలి.
వేడి చేసే స్వభావం ఉన్న వ్యక్తులు ఉదయం పూట టిఫిన్ లకు బదులుగా పెరుగన్నం తినడం ఎంతో శ్రేష్టమైనది. పులుపు లేని పండ్లను తీసుకోవడం మంచిది. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి గింజలతో సహా ఆ నీటిని తాగితే చలువ చేస్తుంది. అలాగే సుగంధి పాల వేర్లు మనకు ఆయుర్వేద షాపుల్లో లభ్యమవుతాయి. ఈ వేర్లపై ఉండే బెరడును పొడిగా చేసి నీళ్లల్లో కానీ, పాలల్లో కానీ కలుపుకుని తాగడం వల్ల కూడా వేడి తగ్గుతుంది. వేడి చేసినప్పుడు లేదా వేడి శరీరతత్వం ఉన్నవారు ఈ చిట్కాలను పాటించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.