ఈ రోజుల్లో మద్యం అనే అలవాటు అనేది కామన్‌గా మారింది. చిన్న పిల్లలు సైతం మద్యం తాగుతుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం అనేక మార్పులకు గురవుతుంది. దీనిలో ముందుగా మెదడు కూడా పలు మార్పులకు గురవుతుంది. తరచూ తాగే వారిలో చాలా మందికి లివర్ సమస్యలు వచ్చి తీవ్రస్థాయికి చేరి మరణిస్తారని తెలుసు. కానీ మద్యపానానికి మెదడులో రక్తస్రావానికి కూడా లింక్ ఉందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. కిందపడడం వల్ల తలకు దెబ్బతగిలి తీవ్ర గాయాలపాలవుతున్న 65 ఏళ్లు పైబడిన వారిలో మెదడులో రక్తస్రావానికి మద్యపానం అలవాటే కారణమని అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం ద్వారా తేటతెల్లమైంది.
ఇదే విషయంపై ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీకి చెందిన షిమిట్ కాలేజీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు కూడా అధ్యయనం చేశారు. అధ్యయనంలో భాగంగా కిందపడి తలకు గాయాలపాలైన 3,128 మందిని పరిశీలించారు. అయితే వీరిలో 18.2 శాతం మంది మద్యం అలవాటు ఉన్నవారని, అందులో 6 శాతం మంది నిత్యం మద్యం తాగేవారు ఉన్నట్టు వారు కనుగొన్నారు.అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే అప్పుడప్పుడు మద్యం తీసుకునే వారి మెదడులో రక్తస్రావం కావడం రెట్టింపు స్థాయిలో ఉందని గుర్తించారు. రోజూ మద్యం తాగేవారిలో అయితే ఏకంగా 150 శాతం అధికంగా ఉంది అని వెల్లడించారు. ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజీ ఆఫ్ ఎమర్జెన్సీ ఫిజీషియన్స్ ఓపెన్’లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి.
కపాలానికి బ్రెయిన్‌కు మధ్య చిన్నచిన్న రక్తనాళాలు అనేకం ఉండడం వలన కపాలం, మెదడుకు మధ్య ఖాళీ ఉండదు. ఏజ్ పెరిగే కొద్దీ గ్రే మ్యాటర్ తగ్గుతూ మెదడు కుంచించుకుపోతుంది. ఆల్కహాల్‌తో ఇది వేగంగా, ఎక్కువగా జరుగుతుంది. దీనికి ఫలితంగా మెదడు, కపాలం మధ్య ఖాళీ ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో తలకు చిన్న గాయమైనా రక్తనాళాలు తెగిపోయి రక్తస్రావం అవుతుంది. కొన్ని సందర్భాల్లో దెబ్బతగిలిన వెంటనే కాకుండా కొద్ది రోజుల తర్వాత రక్తస్రావం జరుగుతుంది. మద్యం అలవాటు ఉన్న పెద్దవారిలో అబ్జార్బేషన్ నెమ్మదిగా ఉంటుంది. దాని ఫలితంగా కొంచెం ఆల్కహాల్ తీసుకున్నా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బీపీ, డయాబెటిస్ ఉన్న పెద్ద వాళ్లలో స్ట్రోక్ అనేది కామన్. అలాగే తెలియకుండానే కాలు, చేయి బలహీనపడిపోవడంతో పాటు నడవలేని పరిస్థితుల్లో పడిపోతారు. దీనికితోడు ఆల్కహాల్ తీసుకునేవారిలో తలకు చిన్న గాయమైనా మెదడులో రక్తస్రావం ముప్పు ఎక్కువగా ఉంటుంది.