Left Over Foods : సాధారణంగా ఫ్రిజ్‌లు ఉన్న ఎవరైనా సరే తినగా మిగిలిపోయిన ఆహారాలను ఫ్రిజ్ లో పెడుతుంటారు. వాటిని మళ్లీ ఇంకో పూట బయటకు తీసి వేడి చేసి తింటారు. అయితే అప్పటికీ ఆ ఆహారం అయిపోకపోతే మళ్లీ దాన్ని ఫ్రిజ్ లో పెడతారు. ఈ విధంగా చాలా మంది చేస్తుంటారు. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహార పదార్థాలను వండిన తరువాత 90 నిమిషాల్లో తినేయాలి. ఆలోగా వాటిని తిని పూర్తి చేస్తే ఓకే. లేదా ఏమైనా ఆహారాలు మిగిలితే వాటిని వండినప్పటి నుంచి 90 నిమిషాల్లోగా ఫ్రిజ్ లో పెట్టేయాలి. అంటే.. ఇప్పుడు మీరు ఏదైనా వండి తింటే.. అందులో ఏమైనా మిగిలితే.. దాన్ని 90 నిమిషాల్లోగా ఫ్రిజ్‌లో పెట్టాలన్నమాట. దీంతో అందులో ఉండే పోషకాలు పోకుండా ఉంటాయి. బాక్టీరియా ఏర్పడకుండా ఉంటుంది.
ఇక ఒకసారి తినగా మిగిలిన ఆహారాలను ఫ్రిజ్ లో పెట్టి తీసి మళ్లీ వేడి చేసి తినవచ్చు. కానీ అంత వరకే వాటిని అయిపోగొట్టాలి. ఆ తరువాత కూడా వాటిని ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ తీసి వేడి చేసి తినరాదు. వాటిల్లో అప్పటికే చాలా వరకు పోషకాలు నశించి ఉంటాయి. పైగా బాక్టీరియా కూడా చేరుతుంటుంది. కనుక ఆహారాలను ఒకసారి మాత్రమే వేడి చేయాలి. మళ్లీ మళ్లీ వేడి చేయరాదు.
ఇక ఆహారాలను వేడి చేయాల్సి వస్తే సాధారణ స్టవ్ మీద వేడి చేయాలి. కానీ మైక్రోవేవ్‌లను ఉపయోగించరాదు. వాటిల్లో తాజాగా వండాల్సి వస్తేనే వాటిని ఉపయోగించాలి. ఇక పాలు, మాంసం, సముద్రపు ఆహారాల విషయంలోనూ ఇవే జాగ్రత్తలను పాటించాలి. దీంతో తినే ఆహారంలో పోషకాలు కోల్పోకుండా చూసుకోవచ్చు.