Pasaru : మనలో చాలా మంది ఉదయం బ్రష్ చేసేటప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకుని పసరును కక్కుతూ ఉంటారు. గొంతులో పేరుకుపోయిన కఫాన్ని తొలగించుకోవడానికి, కడుపులో ఉన్న పసరును తొలగించుకోవడానికి ఇలా నోట్లో వేసుకుని కక్కుతూ ఉంటారు. అలాగే కొందరు నీళ్లు తాగి మరీ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ కక్కుతూ ఉంటారు. ఈ కాలంలో ఇలా నోట్లో వేళ్లు వేసుకుని కక్కేవారి సంఖ్య కొద్దిగా తగ్గినప్పటికి పూర్వకాలంలో పెద్దలు మాత్రం ఇలా ప్రతిరోజూ చేసేవారు. అయితే ఇలా నోట్లో వేళ్లు వేసుకుని పసరు కక్కడం మంచి అలవాటు కాదని అంటున్నారు నిపుణులు. నోట్లో వేళ్లు వేసుకుని బలవంతంగా కఫాన్ని, పసరును కక్కడం వల్ల పొట్ట, ప్రేగులు, డయాఫ్రామ్ ముడుచుకు పోయి దగ్గరగా అవుతాయి. వాటిపై ఒత్తిడి పెరుగుతుంది.
అలాగే ఇలా బలవంతంగా కక్కడం వల్ల గొంతులో రక్తనాళాలు చిట్లే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలు చిట్లి కఫం, పసరుతో రక్తం బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొన్ని రోజులకు ఈ అలవాటు వ్యసనంగా మారి నోట్లో వేళ్లు వేసుకుని కక్కకపోతే నోటిని శుభ్రం చేసుకున్న భావన కలగదు. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల ప్రేగుల్లో హెర్నియా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక నోట్లో వేసుకుని కక్కడం మంచి అలవాటు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ చేయకూడదని అవసరం ఉన్నప్పుడు మాత్రమే చేయాలని నిపుణులు చెబుతున్నారు. తిన్న ఆహారం జీర్ణం కానప్పుడు, వికారంగా ఉన్నప్పుడు, వాంతి చేసుకుంటే బాగుండు అని భావన కలిగినప్పుడే మాత్రమే నోట్లో వేసుకుని కక్కాలి.
నీళ్లు బాగా తాగి ఆ తరువాత నోట్లో వేళ్లు వేసుకుని కక్కాలి. అలాగే కఫం, పసరు ఉన్నట్టుగా అనిపించినప్పుడు నోట్లో వేళ్లు వేసి కక్కడానికి బదులుగా వేప పుళ్లతో దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చిక్కగా పేరుకుపోయిన కఫం కదిలి సులభంగా బయటకు వస్తుంది. అలాగే కఫం సమస్యతో ఎక్కువగా బాధపడే వారు ఎక్కువగా వేడి నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. నోట్లో వేళ్లు వేసుకుని కక్కే అలవాటు ఉన్నవారు ఇప్పటికైనా దానిని వదిలి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.