Potli Samosa : మనం సాయంత్రం సమయాల్లో హోటల్స్ లో లభించే చిరుతిళ్లల్లో సమోసాలు కూడా ఒకటి. వీటిని రుచి చూడని వారు వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. సాయంత్రం సమయాల్లో వీటిని స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు. మనం ఇంట్లో కూడా వీటిని సులభంగా తయారు చేస్తూ ఉంటాము. అయితే సాధారణంగా మనం సమోసాలను తయారు చేయడానికి ఎక్కువగా మైదాపిండిని ఉపయోగిస్తూ ఉంటాము. మైదాపిండికి మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు కనుక మైదాపిండికి బదులుగా మనం గోధుమపిండితో కూడా సమోసాలను తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ సమోసాలను తరచూ చేసే ఆకారంలో కాకుండా భిన్నంగా పొట్లం ఆకారంలో కూడా తయారు చేసుకోవచ్చు. వెరైటీ ఆకారంలో అలాగే గోధుమపిండితో రుచిగా, క్రిస్పీగా ఉండే సమోసాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్లం సమోసా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, వాము – ఒక టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, నూనె – 2 టీ స్పూన్స్.
ఆలూ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, దంచిన జీలకర్ర – ఒక టీ స్పూన్, దంచిన ధనియాలు -ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4, జీడిపప్పు – కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన క్యారెట్ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీస్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి -ఒక టీ స్పూన్, గరం మసాలా -అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంపలు – 3, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పొట్లం సమోసా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో వాము,ఉప్పు, నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి చపాతీ పిండి కంటే గట్టిగా ఉండేలాచూసుకోవాలి. పిండిని చక్కగా కలిపిన తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, జీడిపప్పు, ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి.ఇవి కొద్దిగా మెత్తబడిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత కరివేపాకు, ఉప్పు, పసుపు, ఆమ్ చూర్ పొడి, గరం మసాలా, చాట్ మసాలా వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత బంగాళాదుంపలను మెత్తగా చేసుకోవాలి. తరువాత కొత్తిమీర వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని 4 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి.
తరువాత ముందుగా తయారు చేసిన పిండిని మరోసారి కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ నూనె రాసుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. చపాతీలా వత్తుకున్న తరువాత చపాతీ మధ్యలో బంగాళాదుంప మిశ్రమాన్ని ఉంచాలి. తరువాత చపాతీ అంచుకు తడి చేయాలి. ఇప్పుడు చపాతీ అంచును మడుచుకుంటూ పొట్లంలా చేసుకోవాలి. కూర బయటకు రాకుండా కొద్దిగా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సమోసాలను వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే పొట్లం సమోసాలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. తరచూ ఒకే రకం సమోసాలు కాకుండా ఇలా భిన్నంగా రుచిగా కూడా సమోసాలను తయారు చేసుకుని తినచవ్చు. ఈ సమోసాలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.