Cotton Buds : చాలా మంది ఇళ్లలో కాటన్ బడ్స్ ఉంటాయి. వీటిని అనేక రకాల పనుల కోసం ఉపయోగిస్తుంటారు. అయితే వీటితో చాలా మంది ఎక్కువగా చెవుల్లో గులిమి తీస్తుంటారు. చెవుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు తీసేందుకు కాటన్ బడ్స్‌ను చాలా మంది వాడుతుంటారు. అయితే వాస్తవానికి చెవుల్లో గులిమి తీసేందుకు కాటన్ బడ్స్‌ను ఉపయోగించడం అంత మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెవుల్లో అంతర్భాగం చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటప్పుడు కాటన్ బడ్స్‌ను ఉపయోగించడం ప్రమాదకరమని వారు అంటున్నారు. ఇక గులిమి తీసేందుకు కాటన్ బడ్స్‌ను వాడడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయో వారు వివరిస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చెవుల్లో గులిమి అనేది సహజ సిద్ధంగా ఏర్పడే పదార్థం. చెవుల్లో ఉండే బాక్టీరియా, వ్యర్థాలు, దుమ్ము, ధూళి అంతా కలిసి గులిమిలా తయారవుతుంది. ఇది చెవులకు మేలు చేస్తుంది. ఇది బాక్టీరియా, వైరస్‌లు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. చెవులను రక్షిస్తుంది. అయితే ఎప్పుడైతే కాటన్ బడ్స్ పెట్టి గులిమి తీస్తామో అప్పుడు ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా సూక్ష్మ క్రిములు చెవుల అంతర్భాగంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. అప్పుడు చెవుల్లో ఇన్‌ఫెక్షన్లు కలగవచ్చు. అలాగే గులిమిని తీసేటప్పుడు కొన్ని సందర్భాల్లో అది చెవి లోపలి భాగం వైపు నెట్టివేయబడుతుంది. దీంతో చెవుల్లో గులిమి ఏర్పడే ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో చెవి బ్లాక్ చేయబడి వినికిడి లోపం తలెత్తవచ్చు.
అందువల్ల చెవులను చాలా ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచుకోవడం ముఖ్యం. అయితే మరి చెవిలో ఏర్పడే గులిమి వల్ల చిరాకు పెడుతుంటే ఏం చేయాలి ? అని అందరికీ సందేహం రావచ్చు. అందుకు సహజసిద్ధమైన చిట్కాలను పాటించాలి. చెవుల్లో బాక్టీరియా ఎక్కువైతే దురద పెడుతుంది. దీంతో చిరాకు వస్తుంది. అయితే దీన్ని తగ్గించుకునేందుకు కాటన్ బడ్ లను పెట్టాల్సిన పనిలేదు. చెవుల్లో రెండు చుక్కల కొబ్బరినూనె వేస్తే చాలు. కొబ్బరినూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. దీంతో చెవుల్లో దురద తగ్గుతుంది. అలాగే గులిమి దానంతట అదే బయటకు వస్తుంది. ఇక ఇలా చేయలేమని అనుకుంటే ఈఎన్‌టీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. దీంతో సమస్య నుంచి బయట పడవచ్చు.