Kidneys : మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. శరీరంలో మలినాలను తొలగించడంలో మూత్రపిండాలు మనకు సహాయపడతాయి. ఇవి నిరంతరం పని చేస్తూనే ఉంటాయి. మూత్రపిండాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి లేదంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. మూత్రపిండాలను శుభ్రంగా ఉంచడంలో నీళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రోజుకు 3 నుండి 4 లీటర్ల నీటిని తాగడం మంచిది. నీరు ఎక్కువగా తాగడం వల్ల మన శరీరంలో ఉండే మలినాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. దీంతో మూత్రపిండాలు పరిశుభ్రంగా ఉంటాయి. అలాగే మూత్రపిండాలను ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచడంలో బార్లీ గింజలు మనకు ఎంతో సహాయపడతాయి. నీటిలో బార్లీ గింజలను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగాలి.
ఇలా చేయడం వల్ల మూత్రపిండాల్లో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. అలాగే తాజా పండ్లు, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. మూత్రపిండాల సంబంధిత సమస్యల బారిన పడ్డాము అని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. అలాగే మన జీవన శైలిలో కూడా మార్పు చేసుకోవాలి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజూ తగినంత నీటిని తాగుతూ ఉండాలి.
నీరు ఎంత ఎక్కువగా తాగితే మూత్రపిండాలు అంత ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉప్పును అధికంగా తీసుకోకూడదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఉప్పును తక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. అలాగే చాలా మంది పెయిన్ కిల్లర్ లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిని ఎక్కువగా వాడడం వల్ల మూత్రపిండాలపై చెడు ఫ్రభావాన్ని చూపుతాయి. కనుక వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అదే విధంగా రోజూ నిద్ర పోవడం కూడా చాలా అవసరం. నిద్రలేమి వల్ల కూడా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
అలాగే చాలా మంది మూత్రం వచ్చినప్పటికి విసర్జించకుండా అలాగే ఉంటారు. దీని వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి ఎక్కువగా పడి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే మద్యపానం,ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. టీ, కాఫీలను కూడా ఎక్కువగా తీసుకోకూడదు. రోజూ తగినంత వ్యాయామం చేస్తూ ఉండాలి. అధిక బరువు బారిన పడకుండా ఉండాలి. చక్కటి ఆహారాన్ని తీసుకుంటూ చక్కటి జీవన శైలిని పాటించడం వల్ల మనం మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.