Vankaya Karam Podi : వంకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. వంకాయలతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. వంకాయలతో రుచికరమైన కూరలే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే కారం పొడిని కూడా తయారు చేసుకోవచ్చు. వంకాయ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే వంకాయ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన వంకాయలు – పావు కిలో, ఎండు మిర్చి – 15 లేదా తగినన్ని, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ.
వంకాయ కారం పొడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి చక్కగా వేగిన తరువాత అందులో కరివేపాకు వేసి కరకరలాడే వరకు వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే నూనెలో వంకాయ ముక్కలు వేసి వేయించాలి. వంకాయ ముక్కలు పూర్తిగా వేగిన తరువాత వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో పల్లీలు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో వేయించిన ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత ఇందులోనే వేయించిన వంకాయలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ముందుగా వేయించిన పల్లీలను వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ కారం పొడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయలతో తరచూ చేసే వంటకాల కంటే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ దీనిని ఇష్టంగా తింటారు. నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా వంకాయలతో కారం పొడిని తయారు చేసుకుని తినవచ్చు.