ప్రతి వ్యక్తికి భిన్నరకాలుగా వేలిముద్రలు ఉన్నట్లే ఒక్కో వ్యక్తికి మెటబాలిజం వేరేగా ఉంటుంది. అంటే మనం తిన్న ఆహారం నుంచి లభించే శక్తిని శరీరం ఖర్చు చేసే రేటు అన్నమాట. దీన్ని క్యాలరీల్లో తెలుపుతారు. ఒక్కో వ్యక్తి శరీరం భిన్నంగా క్యాలరీలను ఖర్చు చేస్తుంది. కొందరికి మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది. అంటే క్యాలరీలు వేగంగా ఖర్చవుతుంటాయి. దీంతో వారు ఎప్పుడూ సన్నగా కనిపిస్తారు. బరువు పెరగరు. కొందరికి మెటబాలిజం తక్కువగా ఉంటుంది. దీంతో వారు కొంచెం ఆహారం తిన్నా దాని నుంచి లభించే శక్తి త్వరగా ఖర్చుకాదు. ఫలితంగా కొవ్వు పేరుకుపోతుంది. అధికంగా బరువు పెరుగుతారు. అందుకని మనం మన శరీర మెటబాలిజంను మెరుగు పరుచుకోవాలి. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువును తగ్గించుకోవచ్చు. అయితే మన శరీర మెటబాలిజంను పెంచే పలు ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. కోడిగుడ్లలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల గుడ్లను తింటే శరీర మెటబాలిజంను పెంచుకోవచ్చు. దీంతో క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. కనుక రోజూ ఆహారంలో కోడిగుడ్లను తీసుకోవాలి. రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువును తగ్గించుకోవడం తేలికవుతుంది.
2. అవిసె గింజల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మెటబాలిజంను పెంచుతాయి. కనుక రోజూ గుప్పెడు అవిసె గింజలను తింటే మేలు జరుగుతుంది.
3. పప్పు దినుసులను రోజూ తీసుకుంటున్నా మెటబాలిజం పెరుగుతుంది. వాటిల్లో ఉండే ప్రోటీన్లు మెటబాలిజంను పెంచుతాయి.
4. మిరపకాయలు కారంగా ఉంటాయని కొందరు తినేందుకు వెనుకడుగు వేస్తుంటారు. కానీ రోజూ కారంను కూడా తినాలి. మిరపకాయల్లో కాప్సెయిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. అధిక బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. కనుక రోజూ ఆహారంలో కారం ఉండేలా చూసుకోవాలి.
5. రోజూ ఆహారంలో అల్లంను చేర్చుకోవడం వల్ల కూడా మెటబాలిజంను పెంచుకోవచ్చు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఉదయాన్నే పరగడుపునే అల్లం రసం సేవించవచ్చు. లేదా భోజనం చేసే ముందు కూడా దాన్ని తీసుకోవచ్చు. దీంతో మెటబాలిజం మెరుగు పడుతుంది.
6. రోజూ రెండు కప్పుల గ్రీన్ టీని తాగితే శరీర మెటబాలిజం 20 శాతం మేర మెరుగు పడుతుంది. ఈ విషయాన్ని సైంటిస్టులే తమ అధ్యయనాల్లో వెల్లడించారు. కాబట్టి గ్రీన్‌టీని తాగడం వల్ల మెటబాలిజంను పెంచుకుని అధిక బరువును తగ్గించుకోవచ్చు.
7. రోజూ కాఫీ తాగడం వల్ల కూడా మెటబాలిజం పెరుగుతుంది. కానీ అందులో చక్కెర లేకుండా తాగాల్సి ఉంటుంది. అప్పుడే ప్రయోజనాలను పొందవచ్చు.
8. పాలకూర, క్యాబేజీ వంటి ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలను రోజూ తీసుకుంటే మెటబాలిజం మెరుగు పడుతుంది. అవి బరువు తగ్గేందుకు సహాయ పడతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365